హుజురాబాద్‌పై ప్రత్యేక నిఘా.. స్పెషల్ ఫోర్స్ రెడీ

by Sridhar Babu |   ( Updated:2021-10-06 06:34:40.0  )
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కమిషనరేట్ పోలీసులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

58 ప్రాంతాలు..

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 58 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఈ మేరకు నిఘాను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. సీపీ సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నుండి ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కూడా లేకపోలేదని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తినా ఆధారాలు పకడ్బంధీగా ఉండాలని పోలీసులు భావించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

డ్రోన్ నిఘా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల నాయకులు అనుమతులు తీసుకున్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాలను తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలతో కూడా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కొవిడ్ నిబంధనలు కూడా పాటించాలని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాలను కూడా ప్రచారం చేసే ప్రాంతాల్లో వినియోగించి ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story