ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ సీక్రెట్స్

by Anukaran |
ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ సీక్రెట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అనగానే ముందుగా గుర్తొచ్చేది.. ట్యాంక్‌బండ్, చార్మినార్, గోల్కోండ, జూపార్క్, సాలార్‌జంగ్ మ్యూజియం, నెక్లెస్ రోడ్ మాత్రమే. ముందుగా తెరమీదకు వచ్చే ప్రాంతాలు ఇవే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ.. రాజధాని వాసులు నిత్యం రాకపోకలు చేసే కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి.

చారిత్రక కట్టడాలతో పాటు నిత్యావసరాలకు పేరుపోయిన బేగంబజార్, మలక్‌పేట్ గంజ్, మొండా మార్కెట్, బోయిన్‌పల్లి మార్కెట్‌తో పాటు ముషీరాబాద్‌(దయారమార్కెట్) ఫిష్ మార్కెట్ కూడా ఎంతో ఫేమస్. భాగ్యనగరంలో సముద్రపు చేపలు దొరుతున్నాయంటే అది కేవలం ఈ ఫిష్ మార్కెట్‌ పుణ్యమే.

చెరువు చేప నుంచి మొదలు పెడితే సముద్రపు చేప దొరికేది హైదరాబాద్‌లో కేవలం ఈ ఒక్క ఫిష్ మార్కెట్‌లోనే. బుడ్డ పరక నుంచి సొరచేప వరకు.. పీతల నుంచి రొయ్యల వరకు ప్రతీది ఇక్కడ లభిస్తోంది. సామాన్యుడికి అందుబాటులోనే ధరలు ఉండడంతో మార్కెట్ మంచి ఆదరణ పొందింది. ఎంతోమంది చిరు వ్యాపారులు ఇక్కడి నుంచే చేపలు విక్రయించి ఆయా ప్రాంతాల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ సందడే వేరు.

ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే ఫిష్ మార్కెట్ మధ్యాహ్నాం ఒంటిగంట లోపే ముగుస్తుంది. ఈ లోపే మార్కెట్‌కు దిగుమతి అయిన చేపలు ఖాళీ కావాల్సిందే. అర్థరాత్రి నుంచి ఉదయం వరకు చిరు వ్యాపారులు చేపలు కొనుగోళ్లు చేస్తారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి నిమిత్తం భోజన ప్రియుల కోనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ రూ. 100 కిలో దొరికే చేపలున్నాయి.. రూ. 1500 కిలో చేపలు కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ చేపలను సాల్‌మన అని ఇక్కడ పిలుస్తారు. మార్కెట్‌కు వచ్చిన ఈ చేపలు రాజధానిలోని ప్రముఖ హోటల్స్‌కు ఎక్స్‌పోర్ట్ అవుతాయని తెలుస్తోంది.

మార్కెట్‌లో దొరికే చేపలు:

బొచ్చె
రవ్వ
బంగారు తీగ
కొర్రమీను
చందువా
సాల్మాన
బుడ్డ పరక
చందమామ
జెల్ల
బొమ్మిడిపాము
సొరచేప
ఇసుకదంతు
వీటితో పాటు పలు రకాల సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు మార్కెట్‌లో పుష్కలంగా దొరుకుతాయి.

చేపల దిగుమతి:

జంటనగరాల నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ చేపల మార్కెట్‌క్ చేపలు ఎక్కడి నుంచి వస్తాయో వింటే షాక్ అవుతారు. సముద్రపు చేపలు ప్రధానంగా విశాఖ పట్నం నుంచి నేరుగా మార్కెట్‌‌కు వస్తాయి. అలాగే, తూర్పు గోదావరి జిల్లా ఆక్వా చెరువుల్లో పెంచిన రొయ్యలు సైతం ఇదే మార్కెట్‌కు తీసుకొస్తారు. భీమవరం, విజయవాడ, కృష్ణా, గోదావరి నదుల పరివాహాక ప్రాంతాల నుంచి ఇతర చేపలు లారీల ద్వారా మార్కెట్‌కు చేరుకుంటాయి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేపలు దిగుమతి అవుతుంటాయి. తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూడ ప్రత్యేకంగా చేపలను ఇక్కడి తీసుకొస్తారు.

మార్కెట్ టర్నోవర్:

నిత్యం ఇక్కడ రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల టర్నోవర్ జరుగుతుందంటే ఆశ్చర్యపడాల్సిందే. శని, ఆదివారాల్లో రూ. 2 కోట్ల వరకు మార్కెట్ జరగడం గమనార్హం. అలాగే ప్రతి రోజు టన్నుల్లో చేపలు దిగుమతి అవుతుంటాయి. సోమ-శుక్రవారం వరకు 50 టన్నుల నుంచి 65 టన్నుల వరకు దిగుమతి అవుతుండగా.. ఆదివారం 100-150 టన్నుల చేపలు మార్కెట్‌లో అమ్ముడుపోతాయన్న అంచనా ఉంది.

దీనికి తోడు మంచి కమ్యూనిటీ కలిగిన వ్యవస్థ ఈ మార్కెట్ సొంతం. ఏది ఏమైనా వందల మంది గంగపుత్రులకు ముషీరాబాద్ చేపల మార్కెట్ వరంగా మారితే.. అన్ని రకాల చేపలను అందుబాటులో ఉండటం రాజధాని వాసులు అదృష్టంగా భావిస్తారు.

Advertisement

Next Story