రాజ్యసభకు తను.. శాసనసభకు తనయ?

by Shyam |   ( Updated:2020-02-26 03:17:03.0  )
రాజ్యసభకు తను.. శాసనసభకు తనయ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్‌గా ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఢిల్లీ కేంద్రంగా దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్‌ను యాక్టివ్ చేసే ప్రణాళికను దాదాపు తుది అంకానికి తెచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటును తన మైండ్‌లో నుంచి బయటపెట్టిన సీఎం ఇప్పుడు సీఏఏ అంశాన్ని బలంగా లేవనెత్తి కొత్త ఒరవడి సృష్టించాలని ఫిక్సైపోయినట్లు సమాచారం. రెండు మూడు నెలల్లో అందరు సీఎంలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమిస్తానని చెప్పిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత యాక్షన్‌లోకి దిగబోతున్నారన్నది రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానని రెండేళ్ల క్రితమే గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజెంట్ రాష్ట్రంలో తాను పోషిస్తున్న పాత్రను ఎలా సెట్ చేసి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

సీఎంగా కేటీఆర్ ?

మార్చిలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత సీఎం కుర్చీని కేటీఆర్‌కు అప్పగించి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని కవితకు అప్పగించి హస్తినా ఫ్లైట్ ఎక్కనున్నారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా కవితను పెద్దలసభకు పంపుతారని ప్రచారం జరుగుతున్నా ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అంతేగాక ఇప్పుడు ఏకంగా కేసీఆరే రాజ్యసభ‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో కవితకు ఛాన్స్ దక్కే అవకాశమే లేకుండా పోయింది. ఇద్దరు రాజ్యసభకు వెళ్తే సొంత పార్టీతోపాటు, రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజల నుంచి విమర్శలు వచ్చే స్కోప్ ఉంటుంది కాబట్టి తనకు సన్నిహితంగా ఉండే వినోద్‌కుమార్ లేదా కేకేను తన వెంట తీసుకెళ్తారన్న కామెట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేకేను తన వెంట వద్దనుకుంటే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తీసుకెళ్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గం నుంచి తన కుమార్తె కవితను పోటీ చేయించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సైతం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ప్రభుత్వ బాధ్యతలు, కవిత పార్టీ బాధ్యతలు చూసుకుంటే తనకు కూడా రాష్ట్రం విషయంలో ఎలాంటి బెంగ ఉండదని, ఎన్నికల సమయంలో కొన్ని అడ్వైజెస్ ఇస్తే వాళ్లే పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని తన మనసులో ఉన్న మాటను సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. కొడుకు, కూతురుకు బాధ్యతలు అప్పగించిన రెండు, మూడు నెలల తర్వాత ఢిల్లీలోనే మకాం వేసి వచ్చే ఎన్నికల నాటికి ఫెడరల్ ఫ్రంట్‌కు హండ్రెడ్ పర్సంట్ ప్రాణం పోస్తే వచ్చే ఎలక్షన్ వరకు దేశంలో తనపాత్ర కూడా కీలకం అయ్యే అవకాశాలు ఉంటాని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రె‌స్ పార్టీ డీలా పడిపోవడంతో ఇప్పుడే ఫెడరల్ ఫ్రంట్‌‌కు హైప్ చేస్తే వచ్చే ఎలక్షన్స్ వరకు బీజేపీకి మంచి పోటీ ఇవ్వచ్చన్న అంచనాతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపబోతున్నారని విశ్లేషించుకుంటున్నారు.

రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి తాను తీసుకుంటే మిగిలిన ఇంకో రాజ్యసభ సీటు విషయం రాష్ట్ర రాజకీయాల్లో విషయం చక్కర్లు కొడుతోంది. వినోద్‌కుమార్‌‌ను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచి కాంగ్రెస్ అగ్రనేతలతో పరిచయాలు ఉన్న కె. కేశవరావును తన వెంట రాజ్యసభకు తీసుకెళ్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ కేకేను తనతోపాటు వద్దనుకుంటే వినోద్‌కుమార్ లేదా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల్లో ఒకరిని కచ్చితంగా తన వెంట తీసుకుపోయే అవకాశాలు పలువురు భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంతోష్‌కుమార్ ఆలోచనను సైతం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కీలక నేతలతో చర్చలు, సమావేశాలకు వెళ్లే సమయంలో సంతోష్‌కుమార్‌ను కేసీఆర్ పంపించే అవకాశాలు ఉన్నందున తనకు ఎవరు అయితే అనువుగా ఉంటారో వారి పేర్లను సూచించినా దాన్ని పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ముందు ముందు చూడాల్సిన అంశం.

Advertisement

Next Story

Most Viewed