‘స్పేస్ ఎక్స్‌’ట్రార్డినరీ స్టార్‌లింక్ శాటిలైట్స్

by Harish |
‘స్పేస్ ఎక్స్‌’ట్రార్డినరీ స్టార్‌లింక్ శాటిలైట్స్
X

ఇటీవల స్పేస్‌ఎక్స్ సంస్థ.. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అది జరిగి వారం కూడా కాకముందే మరో 60 కొత్త స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్లను మరో ఫాల్కన్ రాకెట్ ద్వారా పంపినట్టు స్పేస్‌ఎక్స్ సంస్థ.. తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

మే 2019 నుంచి పంపిస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్ శ్రేణిలో ఇది ఎనిమిదో బ్యాచ్. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న మొత్తం స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య 482. కాగా ఈ సిరీస్‌లో మొత్తం 12,000 శాటిలైట్లను స్పేస్‌ఎక్స్ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. అంతరిక్షం ద్వారా భూమ్మీద హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఈ శాటిలైట్ల ద్వారా స్పేస్‌ఎక్స్ కల్పించనుంది. దీని వల్ల ఆన్‌గ్రౌండ్ మొబైల్ టవర్ ద్వారా ఇంటర్నెట్ పంపిణీ కష్టమైన ప్రాంతాల్లో మంచి యాక్సెస్ పొందే అవకాశం కలగనుంది.

ఈసారి పంపిన శాటిలైట్లలో వైసర్ వ్యవస్థను ఇనుమడింపజేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కమ్యూనికేషన్ యాంటెన్నా ఉపరితలం నుంచి సూర్యుని కిరణాలు తప్పించుకోకుండా చేయొచ్చు. ఈ వ్యవస్థ సరిగా పనిచేస్తే భవిష్యత్తులో పంపించబోయే అన్ని ఇంటర్నెట్ శాటిలైట్లకు దీన్ని అమర్చనున్నారు. తక్కువ ఎత్తులో తిరిగే ఈ శాటిలైట్లకు పెద్ద పెద్ద యాంటెన్నాలు ఉండి, సూర్యుని కిరణాలను పరావర్తనం చెందించి పెద్ద మొత్తంలో కాంతిని ప్రసరిస్తాయి. ఈ కాంతి భూమి నుంచి కూడా కనిపిస్తుంది. రాత్రివేళల్లో ఈ శాటిలైట్లను ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేకుండా చూడొచ్చు. ఇవి తక్కువ ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తాయి కాబట్టి, ఎక్కువ మొత్తంలో శాటిలైట్స్ అవసరమవుతున్నాయి. 2021 చివరి నాటికి పూర్తి స్థాయిలో ఈ స్టార్‌లింక్ ప్రాజెక్టును పూర్తిచేసే యోచనలో ఉన్నట్లు స్పేస్‌ఎక్స్ ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisement

Next Story