పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ రంగనాథ్

by Shyam |
పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ రంగనాథ్
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం దామరచర్ల పవర్ ప్లాంట్ కార్మిక సంఘాలు, కార్మికులు, కాంట్రాక్టర్లు, జెన్ కో, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వలస కార్మికులందరినీ స్వస్థలాలకు పంపించేలా అన్నిచర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తుదిదశకు చేరుకున్నదని, మరికొద్ది రోజుల్లో పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ దశలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. కచ్చితంగా స్వస్ధలాలకు వెళ్లాలనుకునే వారిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లల్లో పంపించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. వేతనాలు చెల్లించకుండా మేనేజ్‌మెంట్ ఇబ్బందులకు గురిచేస్తోందని కొందరు కార్మికులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండ్రోజుల్లో పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సూచించారు. వేతనాలు చెల్లించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ రమేశ్ బాబు, జెన్ కో, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags: pending problems, sp ranganath, meet, power plant management, pending salaries, migrant labours

Advertisement

Next Story