ఇంగ్లాండ్‌పై సఫారీల అనూహ్య విజయం.. సెమీస్‌లోకి ఆస్ట్రేలియా

by Anukaran |   ( Updated:2021-11-06 12:34:25.0  )
ఇంగ్లాండ్‌పై సఫారీల అనూహ్య విజయం.. సెమీస్‌లోకి ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జా స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సఫారీలు అనూహ్య విజయం సాధించారు. వరుసగా నాలుగు విజయాలతో ఈ ఏడాది సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్‌కు చివరి మ్యాచ్‌లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా బౌలర్లు. తొలుత టాస్‌ ఓడిపోయిన సఫారీలు బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఆర్. హెన్రిక్స్ (2), డీకాక్ (34) పరుగులతో పెవిలియన్ చేరగా.. డుసెన్ (94 నాటౌట్), మార్క్‌రం (52 నాటౌట్)గా నిలిచి 189/2 భారీ స్కోరు నమోదు చేశారు.

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ పోరాటం విఫలం..

190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ప్రత్యర్థి జట్టుకు ఆది నుంచి వణుకుపుట్టించింది. వరుస బౌండరీలతో అలరించింది. జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ (20) పరుగుల వద్ద గాయం కారణంగా మైదానం వీడాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (26)తో పెవిలియన్ బాట పట్టగా.. మెయిన్ అలీ (37), డేవిడ్ మలన్ (33) పరుగులతో సఫారీలను కంగారు పెట్టారు. ఇక బెయిర్ స్టో (1) నిరాశ పరిచాడు. ఇక మిడిలార్డర్ చివరలో వచ్చిన లివింగ్ స్టోన్ డెత్ ఓవర్లలో వరుసగా మూడు సిక్సర్లు బాది బౌలర్లను టెన్షన్ పెట్టినా (28) పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు.

https://twitter.com/T20WorldCup/status/1457039186205106178?s=20

ఆ తర్వాత చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచిన రబాడ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. తొలి బంతితో క్రిస్ వోక్స్ (7), రెండో బంతికి ఇయాన్ మోర్గాన్(17), మూడో బంతికి జోర్డన్‌ను డకౌట్ చేశాడు. దీంతో 176 పరుగులకే ఇంగ్లాండ్ 8 వికెట్లను కోల్పోయింది. ఇక చివరి మూడు బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్(2 నాటౌట్‌), మార్క్ ఉడ్‌కు(1) సాధ్యపడలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 179 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో సఫారీలు 10 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై అనూహ్య విజయం సాధించారు. కానీ, నెట్‌రన్‌రేట్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా జట్టు సెమీస్‌‌కు మాత్రం ఎంపిక కాలేదు. ఇక సూపర్ 12 గ్రూప్‌ ఏ లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed