జనవరిలో టీపీసీసీకి కొత్త చీఫ్!

by Anukaran |
జనవరిలో టీపీసీసీకి కొత్త చీఫ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో చర్చలు, సంప్రదింపుల ప్రహసనం ముగిసింది. ఇక పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కొత్త సంవత్సరంలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలోని ఏఐసీసీవర్గాల సమాచారం. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం సాయంత్రం సోనియాగాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను కూలంకషంగా వివరించారు. అప్పటికే ఆయన సమర్పించిన నివేదికలోని అంశాలపై సోనియాగాంధీ లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజలలో పార్టీ పట్ల ఉన్న ఆదరణ, ఎలాంటి వ్యక్తి పీసీసీ చీఫ్ అయితే పార్టీకి మళ్లీ జీవం వస్తుంది, పార్టీని నడిపించడంలో ఎవరికి ఎంత మేరకు చిత్తశుద్ధి ఉంది, కేడర్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువగా ఉంది, సీనియర్ నేతల తీరు, పార్టీ సమాచారం బైటకు వెళ్ళడంలో ఉన్న లోపాలు తదితరాలన్నింటిపైనా మాణిక్కం ఠాగూర్ ఆమెకు వివరించారు. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరికి పార్టీ నిర్వహణ బాధ్యతలు ఇస్తే బాగుంటుందో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తన అభిప్రాయాలు కూడా

తెలంగాణ ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో పార్టీ తన ప్రతిష్ఠను కోల్పోవడానికి కారణాలు, నాయకత్వం వైపు నుంచి జరిగిన లోపాలు, పార్టీకి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించిన వ్యక్తులు, వ్యక్తిగత ప్రయోజనం కోసం పార్టీ పేరును వాడుకుంటున్నవారు.. ఇలా అనేక కోణాల నుంచి సోనియాగాంధీకి మాణిక్కం ఠాగూర్ తన అధ్యయనం వివరాలను కూడా వెల్లడించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగూర్ సమర్పించిన నివేదిక మాత్రమే కాకుండా పార్టీ తన మార్గాలలో తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితిపై వచ్చిన నివేదికలోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ అంశాలపై ఆయన నుంచి వివరణ తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story