తండ్రిని బతికించుకునేందుకు తనయుడి ఆరాటం.. వైద్యుల నిర్లక్ష్యంతో!

by Sumithra |   ( Updated:2023-05-19 13:12:28.0  )
తండ్రిని బతికించుకునేందుకు తనయుడి ఆరాటం.. వైద్యుల నిర్లక్ష్యంతో!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : లే నాన్న లే… నీకు శ్వాస అందుతుందా.. నీవు లే నాన్న నీకు ఏమి కాదు నాన్న నాన్న అని చెట్టంతా ఎదిగిన కొడుకు తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం అయింది. తన తండ్రిని ధర్మసుపత్రిలో వైద్యం కోసం తీసుకువస్తే వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. ఈ హృదయ విదారకర ఘటనకు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి వేదికయింది. ధర్మాసుపత్రిలలో పేదలకు ఉచితంగా కరోనా. సాధారణ వైద్య సేవలు అందిస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్న మాటలు ఉట్టి మాటలు అని ఈ ఘటనతో నిర్ధారణ అయింది.. బాధితులు, పోలీస్‌ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్‌కు చెందిన బోదాసు సాయిలు(60)కి శుక్రవారం ఉదయం నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఫిట్స్ వచ్చాయి. అప్పుడే కరోనా లాక్‌డౌన్‌ను బందోబస్త్‌లో ఉన్నా నిజామాబాద్ ఎసీపీ వెంకటేశ్వర్లు ఉన్నపళంగా స్పందించి తన వాహనంలో కానిస్టేబుల్‌ను ఇచ్చి సాయిలును జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో సాయిలు భార్య, కొడుకును ఆసుపత్రికి ఉరుకులు పరుగుల మీదుగా వచ్చారు. అప్పటికి ఆసుపత్రిలో సాయిలును ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా పట్టించుకోలేదు. కనీసం అతన్ని స్ట్రెచర్ పైనుంచి కిందికి దించకపోగా అతనికి వైద్యం కూడా అందించ లేదు. చివరకు సాయిలు కొడుకు తన తండ్రికి శ్వాస అందడం లేదని ఛాతిపై నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతని తండ్రి గుండె పోటుకు గురై మరణించినట్టు చెప్పారు. పోలీసులు మానవతా దృక్పథంతో చేసిన ప్రయత్నం, సాయిలు కొడుకు చేసిన ప్రయత్నం విఫలం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆసుపత్రిలో సాయిలు కొడుకు తన తండ్రిని కాపాడుకోవడం కోసం చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటన చేసిన గంటల వ్యవధిలో ఈ ఘటన జరగడం దారుణం.

Advertisement

Next Story