రూ.1000 కోట్ల ప్రాపర్టీకి ‘పెద్దల’ ఎసరు!

by Sampath |   ( Updated:2021-05-24 23:38:08.0  )
రూ.1000 కోట్ల ప్రాపర్టీకి ‘పెద్దల’ ఎసరు!
X

బహిరంగ మార్కెట్లో ఆ భూమి విలువ గజం రూ.30వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతున్నది. ఎకరం రూ.10 కోట్లకు పైమాటే. ఐదేండ్ల క్రితం వరకు అత్యంత ఖరీదైన ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని అధికారులు ప్రకటించారు. హక్కుదారులెవరూ లేరని చెప్పారు. ఇప్పుడేమో క్రయ విక్రయాలే సాగుతున్నాయి. అదే రూ.1000 కోట్ల విలువైన ఎవాక్యూ ప్రాపర్టీ. ఆ భూమికి వారసులు లేరన్న అధికారులే కొందరు పెద్దలకు హక్కులు ఎలా కట్టబెట్టారన్న అంశంపై అనేక అనుమానాలున్నాయి.2016 నుంచి 2021 మధ్య అసలేం జరిగింది? ఆ భూమిని కాజేసేందుకు పెద్దలు ఎలా చక్రం తిప్పారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మేడ్చల్​జిల్లా జవహర్​నగర్ మండల పరిధిలోని కాప్రా రెవెన్యూ పరిధిలోని 90.28 ఎకరాలను కొందరు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల అండదండలతో స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​మండలంలో రాధిక చౌరస్తా నుంచి దమ్మాయిగూడెం వెళ్లే మార్గంలో సర్వే నం.9, 11, 47, 140, 141, 142, 143, 151, 152, 153, 676, 677లో 90.28 ఎకరాలు ఎవాక్యూ ప్రాపర్టీగా ఉంది. దేశ విభజన సమయంలో నగరానికి చెందిన రహీంబక్స్‌ అనే వ్యక్తి పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ఆయన అనుభవంలోని ఆ భూమిని ఎవాక్యూ ప్రాపర్టీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ది రీజినల్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌/కస్టోడియన్‌ ఆఫ్‌ ఎవాక్యూ ప్రాపర్టీ (బొంబాయి) ఉత్తర్వులు జారీ చేసింది. దేశ విభజన ఒప్పందాల ప్రకారం సదరు భూములను పాకిస్థాన్‌ నుంచి వలసొచ్చిన ఈశ్వరీబాయికి 1966 నవంబర్‌ 30న 20.27 ఎకరాలను, గోపాలదాస్‌, జంగిల్‌మన్‌లకు 1968 అక్టోబర్‌ 13న 64.23 ఎకరాలను, హస్నానంద్‌కు 1968 నవంబర్‌ 21న 13 ఎకరాలను కేటాయించారు. అది ఎవాక్యూ ప్రాపర్టీ కాదంటూ స్థానికులైన మందల బుచ్చం వారసులు, తదితరులు పోరాటం చేశారు. స్థానికులకు అనుకూలంగా 2000 ఏప్రిల్‌ 27 తీర్పునిచ్చిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. సదరు భూమి ఎవాక్యూ ప్రాపర్టీ కాదని, పట్టా భూమి అని పేర్కొంది. దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో నాలుగు రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి.

2011 మే 5న సుప్రీంకోర్టు దీనిని ఎవాక్యూ ప్రాపర్టీగా ప్రకటించింది. ఈ మేరకు స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు.. భూ కేటాయింపులు, హక్కులపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఈశ్వరీబాయి 1999 ఆగస్టు 6న చనిపోయారని, ఆమె బతికున్నప్పుడు తహసీల్దార్‌ ముందు స్టేట్‌మెంట్‌ ఇచ్చారంటూ గుజరాత్‌కు చెందిన ఠాకూర్‌ తిరుమల్‌ మదనాని రంగప్రవేశం చేశారు. ఈశ్వరీబాయికి సంతానం లేకపోవడం వల్ల తనకు భూమి ఇచ్చారంటూ సుప్రీంకోర్టులో 2010 మార్చి 30న ఇంటర్‌అక్విటరీ(ఐఏ) దాఖలు చేశారు. మొదట జీపీఏ హోల్డర్‌గా రిట్‌ దాఖలు చేసిన ఠాకూర్‌ మదనాని.. తర్వాత తనకు భూమి ఇచ్చారని, హక్కుదారుగా చేయాలన్న విజ్ఞప్తితో ఐఏ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు దానిని డిస్మిస్‌ చేయడం గమనార్హం. జీపీఏ అంటే పట్టాదారు బతికి ఉన్నంత కాలమే చెల్లుబాటవుతుందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఇక్కడ ఈశ్వరీబాయికి సంతానం లేదని స్పష్టమైంది. దాంతో పాటు జీపీఏ చెల్లుబాటు కాదని తేటతెల్లమైంది. ఆ తర్వాత అనేక రకాల వివాదాలు, కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది.

బడాబాబుల పేరిట క్రయవిక్రయాలు..

గోపాలదాసు, జంగీల్‌మన్‌లకు సంబంధించిన సర్వే నం.41, 47, 70, 151, 153ల్లోని 64.23 ఎకరాల్లోనూ కొందరు భూ దందాకు తెర తీశారు. గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి కొందరు తాము గోపాలదాసు, జంగిల్‌మన్‌ వారసులమని, ప్రభుత్వం తమకు ఈ భూమిని 1952లో కేటాయించిందంటూ ప్రచారం చేసుకున్నారు. ది కస్టోడియన్‌ ఆఫ్‌ ఎవాక్యూ ప్రాపర్టీ, సెక్రటరీ టు ఎస్‌ఎస్‌ అండ్‌ ఎల్‌ఆర్‌ ఏపీ కమిషనర్‌ సీసీఎస్‌ అండ్‌ ఎల్‌ఆర్‌ నం.ఈపీ2/353/82, తేదీ.4.7.1989 ప్రకారం సదరు భూములను కేటాయించినప్పటికీ హక్కుదారులెవరూ పొజిషన్‌ తీసుకునేందుకు రాలేదని కేటాయింపును రద్దు చేశారు. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్నాయంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రెఫరెన్స్‌ నం.డి3/11416/87, తేదీ.21.11.1987 ద్వారా కస్టోడియన్‌ ఆఫ్‌ ఎవాక్యూ ప్రాపర్టీకి వివరించారు. కానీ ఈ భూములపైనా లావాదేవీలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక కొందరు పెద్దలు, బడా సంస్థలు బినామీల పేరిట క్రయ విక్రయాలు సాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.

అప్పట్లో తిరస్కరణ.. తర్వాత ఆమోదం

కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా భూమిని తమకు మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కొందరు రెవెన్యూ శాఖను ఆశ్రయించారు. అప్పట్లో కీసర(పాత మండలం) తహసీల్దార్‌ వెంకట ఉపేందర్‌రెడ్డి తిరస్కరించారు. దాంతో వారు మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డికి అప్పీలుకు వెళ్లారు. ఆయన ఇన్‌ ద కోర్ట్‌ ఆఫ్‌ ద స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అండ్‌ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా కేసు నెం.ఎ2/1497/2016, తేదీ.18.08.2016 ప్రకారం సర్వే నెం.9, 11, 140, 142, 143, 676, 677ల్లోని 20 ఎకరాలను మ్యుటేషన్‌ చేయాలని, పట్టాదారు పుస్తకం, టైటిల్‌ డీడ్‌ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పటి జాయింట్​కలెక్టర్​రజత్​షైనీకి తహసీల్దార్ అప్పీలుకు వెళ్లారు. ఆయన పెండింగులో ఉంచారు. ఈ క్రమంలో జిల్లాలు, కొత్త మండలాల ఆవిర్భావం జరిగింది. కానీ ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అంటూ కొత్త జిల్లాకు వచ్చిన జాయింట్​కలెక్టర్​కొనుగోలుదార్లకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ ఉత్తర్వులు చేశారు. ఆయన ఆదేశాలను పాటిస్తూ ప్రస్తుత తహసీల్దార్ కె.గౌతంకుమార్​క్లియర్​చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇదే భూమిపై క్రయ విక్రయాలు జరిగినట్లు తెలిసింది. అప్పట్లో పెండింగులో పెట్టిన రెవెన్యూ అధికారులు ఏ కారణంతోనే ఫైళ్లను క్లియర్​చేశారు.

2016 సెప్టెంబరు తర్వాత ఎవరెవరు ఈ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు? వారి దగ్గరున్న ఆధారాలేమిటి? పీఓబీ జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు? ది రీజినల్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌/కస్టోడియన్‌ ఆఫ్‌ ఎవాక్యూ ప్రాపర్టీ (బొంబాయి) అనుమతులు తీసుకున్నారా? అన్న విషయాలపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో సమగ్ర దర్యాప్తు చేయిస్తే ఆ భూమి ప్రభుత్వానిదా? నిజమైన హక్కుదారులెవరు? అన్న విషయాలు వెలుగులోకి వస్తాయని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story