వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడికి ‘ఎక్స్‌ట్రా డే ఆఫ్’ ట్రెండ్

by Shyam |
వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడికి ‘ఎక్స్‌ట్రా డే ఆఫ్’ ట్రెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు చాలా వరకు ఇతర కంపెనీలు కూడా మధ్యే మార్గంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ను ఎంచుకున్నాయి. అయితే, సంస్థలో పని గంటల ప్రకారం ఉద్యోగం చేయడానికి, ఇంట్లో కూర్చొని ఆఫీసు పని చేయడానికి తప్పక తేడాలుంటాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ఉద్యోగుల పని ఒత్తిడి గురించి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎంతోమంది ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ఎక్స్‌ట్రా వీక్ ఆఫ్ ఆఫర్‌తో ఉద్యోగులకు పని భారం ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఆఫీస్‌లో జాబ్ చేస్తే.. షిప్ట్ ప్రకారం తొమ్మిది గంటలు, అవసరమున్నప్పుడు మరో గంట అదనంగా పని చేయడం పరిపాటే. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నారు. అందులోనూ సెలవులు పెట్టే వీలు లేకుండా పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మళ్లీ లీవ్స్ ఎందుకంటూ.. మేనేజ్‌మెంట్ నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. శని, ఆదివారాల్లోనూ ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వస్తోంది. ఇలా పలు కారణాల వల్ల ఉద్యోగుల్లో రోజురోజుకూ పని ఒత్తిడి పెరిగిపోతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న భారతీయ ఉద్యోగులపై చేసిన ఒక సర్వేలో దాదాపు 36 శాతం మంది ఉద్యోగులు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.

తమ ఉద్యోగుల పని ఒత్తిళ్లను, మానసిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని పలు కంపెనీలు ఎక్స్‌ట్రా డే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ నెల కిందనే తమ ఉద్యోగులకు వీకెండ్‌ను మూడు రోజులకు పొడిగించింది. మరికొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాయి. పెప్సికో ఇండియా ఇటీవలే నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ హాలీడే ఇచ్చిది. పీడబ్ల్యూసీ కంపెనీ అక్టోబర్ 5న ‘పెన్ డౌన్ డే’గా ప్రకటించింది. దీంతో కంపెనీ ఉద్యోగులకు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ హాలిడే అవకాశాన్ని కల్పించింది.

ఉద్యోగులు చక్కగా విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్ అవ్వడమే కాకుండా తమ ప్రియమైన కుటుంబ సభ్యులతో హ్యాపీ టైమ్ గడపేందుకు సమయం దొరకుతుందని, దాంతో వాళ్లు మళ్లీ రీస్టార్ట్ అవుతారని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, ఇప్పటికే కొన్ని దేశాలు పని దినాలను తగ్గించే యోచనలో ఉన్నాయి. మరి మన భారత్‌లో కూడా ఈ ఎక్స్‌ట్రా డే ఆఫ్ ట్రెండ్ కొనసాగితే.. మన దగ్గర కూడా పని దినాలు తగ్గిపోతాయి.

Advertisement

Next Story