లక్ష్యానికి దూరంగా కాళేశ్వరం.. ఆశించిన ఫలితం ఏది..?

by Anukaran |
లక్ష్యానికి దూరంగా కాళేశ్వరం.. ఆశించిన ఫలితం ఏది..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ తర్వాత కాళేశ్వరం పేరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే లక్ష కోట్ల (రూ. 1.06 లక్షల కోట్లు)కు పైగా అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు మొదటి దశను దాదాపుగా పూర్తి చేసుకుని నీటిని ఎత్తిపోస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టును, 18,82,000 ఎకరాల స్థిరీకరణ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటిదాకా కేవలం 13.20 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్థిరీకరించగలిగింది. కొత్త ఆయకట్టు ఒక్క ఎకరా కూడా సాధ్యం కాలేదు. మొత్తం 37,07,700 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందించాలని (కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలుపుకుని) అనుకున్నా ఆచరణలో అది 13.20 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన నిర్మాణమని, అతి తక్కువ సమయంలోనే బహుళ ప్రయోజనాలతో సిద్ధమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. కానీ తాజా బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందించిన ‘సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్’ పేర్కొన్న అంశాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. భక్తరామదాసు, ఆలీసాగర్, కోయిల్ సాగర్ లాంటి ఐదు భారీ ప్రాజెక్టులు, ఆరు మీడియం ప్రాజెక్టులు, నిజాంసాగర్ ఆధునికీకరణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని, వీటికి నిర్దేశించుకున్న కొత్త ఆయకట్టు, స్థిరీకరణ సాధించినట్లు ఆ నివేదిక పేర్కొంది. మొత్తం పూర్తయిన పన్నెండు ప్రాజెక్టుల ద్వారా 1.31 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.59 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని తెలిపింది.

కాళేశ్వరం, కల్వకుర్తి, ఎస్సారెస్పీ-2, డిండి, ఎస్ఎల్‌బీసీ, ఎల్లంపల్లి లాంటి పాక్షికంగా పూర్తయిన తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా మొత్తం 64.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావించినా 29.92 లక్షల ఎకరాలకు మాత్రమే అందించగలిగినట్లు స్పష్టం చేసింది. ఒక్క కాళేశ్వరం ద్వారానే సుమారు 37.07 లక్షల ఎకరాలకు (కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిపి) సాగునీటిని అందించాలనుకున్నా కేవలం 13.20 లక్షల ఎకరాల స్థిరీకరణ మాత్రమే సాధ్యమైందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారానే సాగు విస్తీర్ణం పెరిగిందని, పంటల దిగుబడి రెట్టింపైందని ప్రభుత్వం తాజా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొంది.

కానీ, ఔట్‌లుక్ నివేదిక మాత్రం మరో రకమైన పరిస్థితిని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సాగునీటిపారుదల అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం కాలువలు, లింకులు ఏర్పాటవుతున్నాయని, ఆ ప్రక్రియ పూర్తికాగానే వచ్చే ఏడాది తర్వాత కొత్త ఆయకట్టు, స్థిరీకరణ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. పాక్షికంగా పూర్తయిన తొమ్మిది మేజర్, మూడు మీడియం ప్రాజెక్టుల ద్వారా 45.21 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును, 19.19 లక్షల ఎకరాల స్థిరీకరణను చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కేవలం 16.35 లక్షల ఎకరాల మేరకు మాత్రమే కొత్త ఆయకట్టును సాధించగా, 13.57 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయగలిగింది. లక్ష్మి, పార్వతి, సరస్వతి పేర్లతో మూడు ఎత్తిపోతల బ్యారేజీలను, బాహుబలి మోటార్లను బిగించి రికార్డు సమయంలో పూర్తిచేయగలిగినట్లు నివేదికలో పేర్కొంది.

కాళేశ్వరం ప్రాజెక్టు :
లక్ష్యం : కొత్త ఆయకట్టు : 18.25 లక్షల ఎకరాలు
స్థిరీకరణ : 18.82 లక్షల ఎకరాలు
ఫలితం : కొత్త ఆయకట్టు : 0 ఎకరాలు
స్థిరీకరణ : 13.20 లక్షల ఎకరాలు

Advertisement

Next Story

Most Viewed