అది పాటించకపోతే ఇది అనవసరం!

by sudharani |
అది పాటించకపోతే ఇది అనవసరం!
X

కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నపుడు ఇంట్లోనే కూర్చుని కొవ్వొత్తులు వెలిగించారు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నపుడు మాత్రం ఆఫీసులకు వచ్చి కీబోర్డులు కొడుతున్నారు. ఆరోగ్యం కంటే ఆర్థికమే ముఖ్యమంటూ చక్కర్లు కొడుతూ తిరుగుతున్నారు. కనీసం మాస్క్ అయినా సరిగా ధరిస్తారా? అంటే లేదు. ఏదో ఒక గుడ్డపీలికకు రెండు పట్టీలు తగిలించుకుని వస్తున్నారు. అది కూడా సరిగా వాడుతున్నారా అంటే.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఊపిరి ఆడట్లేదని వంకలు చెబుతూ తీస్తున్నారు. ఆ మాత్రం దానికి మాస్క్ వేసుకోవడం ఎందుకు?

నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు కరోనాను కట్టడి చేయడంలో మాస్క్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక మాస్కుల్లో మెడికల్ మాస్క్‌లు, గుడ్డతో చేసిన మాస్క్‌లు ఉంటాయని గతంలో దిశలో వచ్చిన కథనంలో తెలుసుకున్నాం. అయితే ఏ మాస్కులు ఎప్పుడు వాడాలో డబ్ల్యూహెచ్‌వో కొన్ని సూచనలు జారీ చేసింది. 60 ఏళ్లు దాటినవారు, పిల్లలు, షుగర్ వ్యాధిగ్రస్తులు, హృద్రోగులు, ఇంకా ఇతర క్రోనిక్ జబ్బులతో బాధపడుతున్నవారు కచ్చితంగా మెడికల్ మాస్క్‌లు ధరించాలని పేర్కొంది. గుడ్డతో చేసిన మాస్కులు లేదా సింగిల్ లేయర్ మాస్క్‌లు వాడే వారు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించింది. సామాజిక దూరం పాటించని చోట ఈ మాస్క్‌ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

డబ్ల్యూహెచ్‌వో చెప్పిన దాని ప్రకారం.. ముఖ్యంగా కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మాస్క్ వాడకం తప్పనిసరి. ఇక ఇప్పుడు దేవాలయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ కూడా తెరిచినందున ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నలతగా అనిపించినా.. మన కోసం కాకపోయినా, ఇతరుల క్షేమం కోసమైనా ఇంట్లోనే ఉండి క్వారంటైన్ పాటించాలి. కేవలం మాస్క్‌ను నామమాత్రంగా వాడటం కాదు, మనస్ఫూర్తిగా వాడాలి. కేసులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదని గుర్తుంచుకోండి.

Advertisement

Next Story

Most Viewed