వందల ఏళ్ల తర్వాత బాగ్దాద్‌లో అద్భుతం

by Shyam |
వందల ఏళ్ల తర్వాత బాగ్దాద్‌లో అద్భుతం
X

ఇప్పటి వరకు చూడని ఒక వింతని బాగ్దాద్ వాసులు ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా యువత, పిల్లలు ఈ కొత్త వాతావరణాన్ని అనుభూతి పొందుతున్నారు. ఎప్పుడూ వేడి, చెమటతో సతమతమయ్యే వారి ప్రాంతంలో ఒక్కసారిగా మంచు కురుస్తుండటమే ఇందుకు కారణం. వందల ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి మంచు కురిసిందని పెద్దవాళ్లు కొంతమంది చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు కురవడం రెండోసారి అని అంటున్నారు.

శుక్రవారం రోజు ఉదయాన్నే బాగ్దాద్ నగరంలో ఎక్కడ చూసినా తెల్లని పరుపు కప్పినట్లుగా మంచు ఉండటం చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. వెంటనే తమ కెమెరాలతో ఫొటోలు తీయడం ప్రారంభించారు. మంచు ముద్దలతో ఆటలు ఆడారు. ఆ ఫొటోలన్నింటినీ సోషల్ మీడియాల్లో అప్‌లోడ్ చేశారు.

స్థానిక వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం 2008లో కూడా మంచు కురిసిందట కానీ ఏదో రెండు నిమిషాలు పడీపడనట్లుగా పడిందని చెప్పారు. అయితే శుక్రవారం పడినట్లుగా మంచు కురవడం వందల ఏళ్ల క్రితం జరిగిందని, ఇది రెండోసారి అని వాళ్లు చెప్పుకొచ్చారు. ఇలా మంచు కురవడం ఇంతవరకూ చూడలేదని యువ ఇరాకీలు ఆనందపడ్డారు.

వాతావరణ మార్పులే కారణమా?

ఓ వైపు మంచు కురవడం ఆహ్లాదకరంగా ఉన్నా, ఎప్పుడూ 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే బాగ్దాద్ లాంటి ప్రదేశంలో ఇలా జరగడం తీవ్రవాతావరణ మార్పును సూచిస్తోందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. గత వేసవి కాలంలో బాగ్దాదీయులు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా మంచు కురవడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ మంచు కురవడానికి కారణం యూరప్ నుంచి వచ్చిన కోల్డ్ వేవ్ కారణమని, దీనికి తీవ్ర వాతావరణ మార్పుకి, వాతావరణ సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని ఇరాకీ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed