స్టాక్ పాడవుతోంది.. అమ్ముకోనియండి

by Anukaran |
Footpath traders3
X

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకు బండి సాగాలంటే ఏదో పనిచేసుకోవాల్సిందే. ఆ పని చేస్తేనే నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లేది. లేకుంటే పస్తులండాల్సిందే. అందుకోసం కొందరు ఒకరిపై ఆధారపడకుండా ఫుట్ పాత్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చే కాస్తోకూస్తో డబ్బుల్తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సంసారం సాఫీగా సాగుతుందకుంటున్న తరుణంలో కరోనా వారి కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. కరోనా ఉదృతిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన సరుకు అమ్ముడుపోక, గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలే అర్ధం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పెట్టుబడి ముందే పెట్టి సరుకు తెచ్చుకుంటారు. తెచ్చిన సరుకును రోడ్లవెంట ఉన్న ఫుట్ పాత్లపై పెట్టి అమ్ముతుంటారు. తెచ్చిన సరుకుపై రూ.10 నుంచి రూ.20లోపు లాభం చూసుకొని జీవనం సాగిస్తుంటారు. వచ్చిన దానితో కుటుంబాలను పోషించుకుంటారు. అయితే గతేడాది కాలంగా కరోనా మహమ్మారి వారిని ఆర్ధికంగా కుంగదీస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించడంతో తెచ్చిన సరుకులు అమ్ముడు పోక నానా ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన ధరకు అమ్ముకుందామన్నా కొనుగోలు చేసేవారు లేక పోవడంతో ఎలా అమ్ముకోవాలో తెలియక లోలోన కుంగిపోతున్నారు.

ఫుట్‌పాత్ లపై ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, అరటి, మామిడి, ఆపిల్, ద్రాక్ష, సంద్రాలు ఇతర రకాల పండ్లను అమ్ముతుంటారు. వీటితో తోడు కొబ్బరి బోండాలు, చెరుకు రసాలు, ఫ్రూట్ జ్యూస్ తదితరాలను విక్రయిస్తుంటారు. అయితే వాటిని పండ్ల మార్కెట్లలో కొనుగోలు చేసి ఫుట్ పాత్‌లపై విక్రయాలు జరుపుతుంటారు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వాడిపోవడం, కుళ్లిపోతాయి. అయితే వీటిని తీసుకొచ్చిన రెండు మూడ్రోజుల్లోనే అమ్మాల్సి ఉంటుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అమ్మాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు తక్కవ కొనుగోలు చేస్తుండటంతో తెచ్చిన సరుకంతా అలాగే నిల్వ ఉండిపోతుందని పలువురు వాపోతున్నారు. కొన్ని పండ్లు, కూరగాయలు కుళ్లిపోతుండటంతో వాటిని చెత్తకుప్పల్లో వేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు ముందు రోజూ రూ.600 ల నుంచి రూ.800ల వరకు అమ్మితే గిట్టుబాటు అయ్యేదని, ఇప్పడు రోజూ రూ.200 కూడా అమ్మలేక పోతున్నామని ఫుట్ పాత్ వ్యాపారులు తెలిపారు. తెచ్చిన సరుకు అమ్ముడుపోక పోవడంతో కుళ్లిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, దీనికి తోడు ఇంటి అద్దెలు కూడా కట్టలేక పోతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పండ్లు అమ్ముడుపోతల్లేవ్

గత15 ఏళ్లుగా పండ్లు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. కరోనాతో ప్రజలు ఎవరూ కొంటందుకు వస్తలేరు. తెచ్చిన కొద్ది సరుకు మామిడి, ద్రాక్ష, అరటిపండ్లు , ఖర్జూర అమ్ముపోక పాడై పోతున్నాయి. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. పండ్లు అమ్ముడు పోతేనే ఇళ్లు గడిచేది.
-ఎండీ ముస్తాఖ్, పండ్ల వ్యాపారి

అల్లం, ఎలిపాయ ఖరాబు అవుతోంది

రెండు వేల రూపాయలు పెట్టి అల్లం, ఎలిపాయ కొనుక్కొని వచ్చా. తోపుడు బండిపై పెట్టి కిలో పది,పదేహేను రూపాయల లాభం తీసుకొని అమ్ముతుంటా. ఇది వరకు రోజూ రూ.500 పైగా సంపాదించేవాడిని. లాక్ డౌన్ తో కొనేటోళ్లు కరువైండ్రు. తెచ్చిన అల్లం మురిగిపోతుంది. ఎలిపాయ ఎండిపోతుంది ఏట్ల చేయాల్నో తెలుస్తలేదు.
– గౌరేజ్, వెంకటగిరి కాలనీ

కుటుంబం గడవడం కష్టమైతంది

మాది యూసుఫ్‌గౌడ. మానాన్న దగ్గర్నుంచీ అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నం. కరోనా వచ్చినప్పటి నుంచి మాకు గిరాకీ అయితలేదు. తెచ్చిన అరటిపండ్లు రెండుమూడ్రోజులకే పాడవుతున్నాయి. తెచ్చిన ఖరీదు కూడా ఎల్లడం లేదు. కుటుంబాన్ని ఎట్ల పోషించుకోవాల్నో అర్ధం కావడం లేదు.
-యాదగిరి, అరటిపండ్ల వ్యాపారి, యూసుఫ్‌గూడ

ఆకుకూరలు అమ్మితేనే…

పాలకూర, బచ్చలి కూర, గోంగూర,తోటకూర, పూదిన, కోతిమీర, ఉల్లిఆకులతో పాటు టమాట, నిమ్మకాయలు, పచ్చమిర్చి అమ్మతుంటా. వచ్చేదానితో ఇంట్లోని నలుగురం బతుకాలి. లాక్‌డౌన్ తో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వచ్చిన వారు రూ.10 ఎక్కువ తీసుకుంటలేరు. దీంతో ఆకుకూరలు అమ్మడుపోకపోగా అవి ఎండిపోతుండటంతో మాకే నష్టం అవుతుంది.
-పౌల్, ఆకుకూరల వ్యాపారి

తెచ్చిన స్టాకంతా అట్లనే ఉంది

ఎండాకాలం ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగుతారని స్టాక్ తెచ్చా. అయితే ఈ లాక్ ‌డౌన్ తోనే గిరాకీ తగ్గింది. ఒక్క బోండా అమ్మితే రూ. 5 వస్తాయి. అవి ఎండిపోతుండటంతో ఒక్కో బోండాపై రూ.10 నష్టపోతున్నాం.
-రాజు, కొబ్బరి బోండాల వ్యాపారి

ప్రభుత్వమే ఆదుకోవాలి

టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అది నడిస్తేనే కుటుంబం గడిచేది. ఎక్కువగా టీ తాగేందుకు ఉదయం 9 గంటల నుంచి వస్తారు. అయితే లాక్ డౌన్ తో గిరాకీ లేదు. తెచ్చిన పాల ఖర్చు కూడా ఎల్తలేదు. టీ స్టాల్ మీద ముగ్గురు బతుకుతున్నం. ప్రభుత్వమే ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలి.
-రాణి, భగవాన్ టీ స్టాల్

Advertisement

Next Story