ప్రిన్సెస్ డయానా వెడ్డింగ్ కేక్.. 40 ఏళ్ల తర్వాత వేలానికి!

by Shyam |   ( Updated:2021-07-30 04:37:24.0  )
Princess-Diana
X

దిశ, ఫీచర్స్ : ఇరవయ్యో శతాబ్దపు అందగత్తెలుగా గుర్తింపు పొందినవారిలో ప్రిన్సెస్ డయానా ఒకరు. ఆమె మరణించి రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ తన జీవిత విశేషాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. బ్రిటన్‌లోని స్పెన్సర్ కుటుంబంలో జన్మించిన డయానా.. బ్రిటన్ రాకుమారుడు చార్లెస్‌ను 1981 జూలై 29న పెళ్లాడింది. ఈ సందర్భంగా డిజైన్ చేసిన వెడ్డింగ్ కేక్‌ను ‘హాట్ కేక్’ అనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆ కేకును ఇప్పటికే రెండుసార్లు వేలం వేయగా, తాజాగా మరోసారి ఆక్షన్‌కు వచ్చింది.

డయానాకు సంబంధించిన అనేక వస్తువులు ఇదివరకే వేలం వేయగా, హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 2017లో డ‌యానా వెడ్డింగ్ కేక్‌తో పాటు పెళ్లి వేడుక‌లో ఉప‌యోగించిన లేఖ‌లు, ఫొటోలు, ర‌త్నాలు పొదిగిన బ్యాగ్ వంటివి వేలం వేశారు. కాగా ఇప్పుడు మరోసారి వెడ్డింగ్ కేక్‌ను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ‘రాయ‌ల్ నావ‌ల్ కుకింగ్ స్కూల్‌’కు చెందిన డేవిడ్ ఏవ‌రీ త‌యారుచేశారు. మొత్తంగా రాజకుటుంబ వివాహానికి 23 కేకులు రూపొందించగా, ఇందులో ఐదడుగుల ఎత్తైన ‘సెంటర్ పీస్ ఫ్రూట్ కేక్’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఇందులోని ఓ కేకు ముక్కను క్వీన్ ఎలిజబెత్ ఇంటి సభ్యుడైన మొయిరా స్మిత్‌కు అందించారు. దాన్ని క్లాంగ్ ఫిల్మ్‌తో భద్రపరిచిన స్మిత్.. ఒక కేక్ బాక్స్‌లో పెట్టి ‘హ్యాండిల్ విత్ కేర్ ప్రిన్స్ చార్లెస్ & ప్రిన్సెస్ డయానా వెడ్డింగ్ కేక్’ అని రాసిపెట్టాడు. స్మిత్ కుటుంబీకులు ఆ ముక్కను 2008 వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత దాన్ని సొంతం చేసుకున్న ఓ కలెక్టర్.. 2017లో మరో ఆక్షన్ హౌజ్‌కు విక్రయించాడు. ప్రస్తుతానికి ఆ కేక్ స్లైస్.. యూకే, సిరెన్స్‌టర్‌‌కు చెందిన డొమినిక్ వింటర్‌ ఆక్షనీర్స్ వద్ద ఉంది.

‘40 ఏళ్లయినా వెడ్డింగ్ కేక్ స్లైస్ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ దాన్ని తినకుండా ఉండాలని సలహా ఇస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటీష్ రాయల్టీ అభిమానుల మనసు దోచుకుంటుందని భావిస్తున్నాం’ అని క్రిస్ ఆల్బరీ(డొమినిక్ వింటర్ ఆక్షనీర్స్‌ ) అన్నారు. ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహ కేకు ముక్క వేలంలో £ 500 వరకు పొందవచ్చని వేలందారులు భావిస్తున్నారు. దీన్ని ఆగస్టు 11న వేలం వేయనున్నారు.

Advertisement

Next Story