స్కల్ బ్రేకర్.. ఆ యాప్‌లకు బాప్

by Harish |
స్కల్ బ్రేకర్.. ఆ యాప్‌లకు బాప్
X

స్మార్ట్‌ ఫోన్లతో సావాసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. దీంతో కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆటలతో పిల్లలు, పెద్దలు డేంజర్‌ జోన్‌లోకి వెళ్తున్నారు. మొన్నటి బ్లూ వేల్, నిన్నటి పబ్జీ గేమ్‌ యాప్‌లు పిల్లల భవిష్యత్‌ను ఆగం చేస్తే ఇప్పుడొచ్చిన స్కల్ బ్రేకర్ ఛాలెంజ్‌ ఆ యాప్‌లకు బాప్‌లా తయారైంది. ముగ్గురు కూడి సరదాగా చేసే సన్నివేశాలు చావు దగ్గరకు తీసుకెళ్తున్నాయి. ఇక బతికినా చచ్చినట్టే లెక్క.. అనే పరిస్థితులను తయారు చేసి మంచం మీద పడేస్తున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన స్కల్ బ్రేకర్ ఎలా చేస్తారన్నది గమనిస్తే దిమ్మతిరిగి మైండ్‌బ్లాంకై పోవడం ఖాయం.

ఈ నెలరోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతున్న స్కల్ బ్రేకర్ ఛాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు పాల్గొంటారు. అటు ఇటు చివరి వ్యక్తులు ఒక సెకను ముందు పైకి ఎగిరి తాము నిలబడిన స్థానంలోకి వచ్చే టైంలోనే మధ్యలో ఉన్న వ్యక్తి పైకి ఎగురుతాడు. ఆ సమయంలో పక్కనున్న ఇద్దరు వ్యక్తులు చెరో కాలితో మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను తన్నుతారు. దీంతో ఆ వ్యక్తి వెల్లకిలా పడి పోతాడు. ఇలా ఒకేసారి కింద పడటంతో వెన్నుపూస తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా తలకు తీవ్రగాయమై చనిపోయే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇలా కాకుండా ఏమాత్రం మళ్లీ బ్యాలెన్స్ తప్పి క్రాస్‌గా పడినా పక్కటెముకలు విరిగి జీవితాంతం మంచంపై ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి.

పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం
ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓరేంజ్‌లో వైరల్‌గా మారడంతో వీటిని అనుకరించే పిల్లలు తమ ప్రాణాలు మీదకు తెచ్చుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఇంట్లో పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చినా టిక్ టాక్‌ లేకుండా చూసుకోవాలి. ఇది ప్రమాదకరమైందని తెలిసినా కొందరు మళ్లీ టిక్‌టాక్‌లో పోస్టు చేస్తుండటంతో పిల్లలు చూసినప్పుడు మళ్లీ స్కల్‌బ్రేకర్‌ను వెంటనే అనుకరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలను కూర్చోబెట్టి స్కల్ బ్రేకర్‌ గురించి వివరించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed