ఆస్ట్రేలియాలో అతిపెద్ద రేడియో టెలీస్కోప్

by Shyam |
ఆస్ట్రేలియాలో అతిపెద్ద రేడియో టెలీస్కోప్
X

దిశ, ఫీచర్స్: ఆప్టికల్ టెలీస్కోప్స్ కేవలం కంటికి కనపడే వస్తువుల్ని మాత్రమే మరింత దగ్గరగా, స్పష్టంగా చూపగలవు. వాయువులు లేదా కాస్మిక్ డస్ట్ వంటి కంటికి కనపడని వాటిని చూడాలంటే మాత్రం రేడియో టెలీస్కోప్ అవసరం కాగా, రేడియేషన్‌ను వెలువరించే వస్తువుల్ని చూడటం కేవలం దీంతోనే సాధ్యం. నాసా ప్రకారం.. రేడియో ఖగోళ శాస్త్రం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభం కాగా, అప్పటి నుంచి ఖగోళ పరిశీలనలు చేయడానికి ‘రేడియో టెలిస్కోప్’ కీలకంగా మారింది. రేడియో టెలీస్కోప్‌‌లో డిష్ ఎంత పెద్దదిగా వుంటే అంత ఎక్కువ తరంగాల్ని అది ఒడిసి పట్టుకోవడంతో పాటు మరింత దూరం నుంచి వచ్చే బలహీన తరంగాల్ని కూడా విశ్లేషించే వీలుంటుంది. అందువల్లే నక్షత్రాలు, నెబ్యులాలు, గెలాక్సీలు చాలా దూరంలో ఉండటంతో వాటి నుండి వెలువడే రేడియో తరంగాలు చాలా బలహీనంగా ఉంటాయి. వీటిని సమర్ధవంతంగా గ్రహించడానికి పెద్ద పెద్ద డిష్ యాంటెన్నాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే ‘స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ కౌన్సిల్ (ఎస్‌కెఏవో)’ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించగా, ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

‘స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ కౌన్సిల్’ అనేది రేడియో ఖగోళ శాస్త్ర సంకేతాలను తెలుసుకోవడానికి కొత్తగా ఏర్పాటైన ఇంటర్‌ గవర్నమెంటల్ సంస్థ కాగా, దీని ప్రధాన కార్యాలయం యూకేలో ఉంది. ప్రస్తుతానికి.. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, ఇటలీ, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, నెదర్లాండ్స్, యూకేకు చెందిన పది దేశాల సంస్థలు ఎస్‌కెఏవోలో భాగంగా ఉన్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌‌ నిర్మించనుండగా.. దీని ఆపరేషన్, నిర్వహణ, నిర్మాణాన్ని ఎస్‌కెఏవో పర్యవేక్షించనుంది. ఈ టెలి‌స్కోప్ పూర్తి చేయడానికి 1.9 బిలియన్ యూరోలు వ్యయం అవుతుండగా, పూర్తికావడానికి పదేళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. చాలా వేగంగా మొత్తం ఆకాశాన్ని సర్వే చేయడానికి ఎస్‌కెఏ వేలాది డిషెస్‌తో పాటు మిలియన్‌ సంఖ్యలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నాలను ఇందుకోసం ఉపయోగించనుంది.

‘ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్ (ASKAP)’ అనే మరొక శక్తివంతమైన టెలిస్కోప్‌ను ఉపయోగించి చేపట్టిన వివిధ సర్వేల ఫలితాలను ఎస్‌కెఏ ఉపయోగిస్తోంది. దీనిని ఆస్ట్రేలియా సైన్స్ ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వో అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 2019 నుండి పూర్తిగా పనిచేస్తున్న ఈ టెలిస్కోప్ గత ఏడాది చివర్లో నిర్వహించిన మొట్టమొదటి ఆల్-స్కై సర్వేలో రికార్డు స్థాయిలో 300 గంటల్లో మూడు మిలియన్ గెలాక్సీలను మ్యాప్ చేసింది. ఏఎస్‌కేఏపీ సర్వేలు విశ్వ నిర్మాణం, పరిణామాన్ని మ్యాప్ చేయడానికి రూపొందించగా, ఇది గెలాక్సీలను, అవి కలిగి ఉన్న హైడ్రోజన్ వాయువును పరిశీలించడం ద్వారా మ్యాప్ చేస్తుంది.

Advertisement

Next Story