హామీగానే మిగిలిపోయిన ఫిలిం సిటీ

by Shyam |
హామీగానే మిగిలిపోయిన ఫిలిం సిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు నెలల తర్వాత, 2014 జూలై 31న సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర శివారు ప్రాంతంలోని రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోకుండా చూస్తామన్నారు. అన్ని హంగులూ ఇక్కడే కల్పిస్తామని హామీ ఇచ్చారు. నటుడు కృష్ణను ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించిన బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని కూడా చెప్పారు. సి.కల్యాణ్, దగ్గుబాటి సురేష్, ఎన్వీ ప్రసాద్ లాంటివారంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆనాడు ప్రశంసల్లో ముంచెత్తారు. కృష్ణ ఒక అడుగు ముందుకేసి ఫిలిం సిటీకి కేసీఆర్ పేరే పెడతామని ప్రకటించారు. ఆరేళ్లు గడిచిపోయాయి. అది హామీగానే మిగిలిపోయింది. 2020 నవంబరు ఏడున సీఎం కేసీఆర్ మళ్లీ ఫిలిం సిటీ ప్రస్తావన తీసుకొచ్చారు. రెండు వేల ఎకరాల్లో సినీ సిటీ నిర్మాణం జరుగుతుందని, ఈ పరిశ్రమపై ఆధారపడిన పది లక్షల కుటుంబాల జీవితాలు పదిలంగా ఉండడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

‘రాచకొండ’ అనువైనది..

గతంలో సినీసిటీ గురించి జరిగిన చర్చలో అప్పటి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కమిషనర్ జయేశ్ రంజన్ (టీఎస్ఐఐసీ ఎండీ కూడా), ప్రభుత్వ సలహాదారు పాపారావు, పలువురు సీఎంఓ అధికారులు పాల్గన్నారు. పార్మాసిటీ, కెమికల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీలతోపాటు సినీ సిటీని కూడా నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడినాక సినీ పరిశ్రమ విశాఖపట్నం లేదా నెల్లూరు జిల్లాకు తరలిపోతుందన్న సందిగ్ధ పరిస్థితులు ఉన్న సమయంలో సీఎం ఫిలిం సిటీ నిర్మాణం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాల్లో ఒకే చోట రెండు వేల ఎకరాల స్థలం దొరకడం కష్టమని భావించిన అప్పటి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు రాచకొండలో సుమారు 30 వేల ఎకరాల స్థలం ఉందని గుర్తించారు. ఇదే అనువైన ప్రదేశమని ప్రభుత్వానికి, సినీ ప్రముఖులకు సూచించారు. ఎలాంటి పురోగతి లేదు.

నిర్మించి తీరుతాం..

ఆ తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల సమక్షంలో అల్లూరి సీతారామరాజు సినిమా ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ బాలీవుడ్ తరహాలో ఏ స్థాయిలోనైనా సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ తదితర అన్ని రకాల అవసరాలకు ధీటుగా ఫిలిం సిటీ ఉంటుందని ప్రకటించారు. దీనిని అవసరమైతే నాలుగైదు వేల ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. సినిమాలకు మాత్రమే కాక టీవీ షూటింగులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోదని, ఇక్కడే ఉంటుందని, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. స్థల ఎంపిక కోసం సీఎం స్వయంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఫిలిం సిటీని నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించడం విశేషం. నగరంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా వేలాది కుటుంబాలు ఇబ్బంది పడడంతో సినీ రంగానికి చెందిన పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. చెక్కులను స్వయంగా అందజేయడానికి చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్‌‌కు వచ్చిన సందర్భంగా సీఎం మరోసారి ఫిలిం సిటీ ప్రస్తావన తీసుకొచ్చారు.

Advertisement

Next Story