ఆరుగురు విదేశీ ప్రయాణీకులకు పాజిటివ్

by vinod kumar |
ఆరుగురు విదేశీ ప్రయాణీకులకు పాజిటివ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: చాలా రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తూ ఉంటే ఇప్పుడు వాటికి అదనంగా వలస కార్మికులు, విదేశీ ప్రయాణీకులు తోడవుతున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది విదేశీ ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా తాజాగా ఆదివారం మరో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో విదేశీ ప్రయాణీకుల్లో కరోనా వచ్చినవారి సంఖ్య 14కు చేరుకుంది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ళు, రోడ్డుమార్గం ద్వారా వచ్చిన వలస కార్మికుల్లో మొత్తం 130 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. 11 మంది వలస కార్మికులకు, ఇతర దేశాల నుంచి ‘వందేభారత్’ విమానాల ద్వారా వచ్చిన ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. తాజా పాజిటివ్ కేసులతో ఇప్పటివరకు కరోనాబారిన పడినవారి సంఖ్య 1,854కు చేరుకుంది. మరోవైపు ఒకే రోజున నలుగురు పేషెంట్లు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 53కు చేరుకుంది.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మొదటి నుంచీ ఆందోళన పడుతున్నట్లుగానే విదేశీ ప్రయాణీకులు, వలస కార్మికులతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండడంతో వారంరోజుల తర్వాత వీరిలో ఎంత మంది పాజిటివ్ పేషెంట్లుగా మారుతారో, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్ష చేయడం తలకు మించిన భారమవుతుందని వాపోతున్నారు. లాక్‌డౌన్ ఈ నెల 31తర్వాత ఉంటుందో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ తగినంత సంఖ్యలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed