బిగ్ బ్రేకింగ్ : పైకి లేచిన ‘సిరిపురం’ పంప్‌హౌజ్ పైపులు

by Anukaran |   ( Updated:2021-07-24 10:35:40.0  )
kaleshwaram-paipe-line
X

దిశప్రతినిధి, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిరిపురం పంప్ హౌజ్ వద్ద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసేన భారీ సైజు పైపులు భూమి పోరలు చీల్చుకుని పైకి లేచాయి. అది గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్ నుండి సందిళ్ల బ్యారేజ్‌కు నీటిని తరలించేందుకు సిరిపురం పంప్ హౌజ్ వద్ద ఈ భారీ సైజు పైపులను ఏర్పాటు చేయగా అవి పైకి తేలాయి. సిరిపురం వద్ద 10 నుండి 15 ఫీట్ల వ్యాసార్థం కలిగిన పైపులను 24 లైన్లు వేశారు. 12 మోటార్ల సాయంతో ఎగువ ప్రాంతానికి నీటిని ఎత్తిపోసేందుకు ఈ పైప్ లైన్‌ను ఏర్పాటు చేశారు కాళేశ్వరం ఇంజినీర్లు. రెండు రోజుల నుంచి ప్రాజెక్టు మీదుగా భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఏర్పడిన ఒత్తిడి కారణంగానే ఈ పైపులు భూమి లోపల నుండి పైకి తేలాయా..? లేక మరేదైనా కారణమో ఉందో తెలియడం లేదు.

కానీ, పంప్ హౌస్ నుండి బ్యారేజీ వరకు మధ్యలో సగం మేర ఒక వైపు పైపు లైన్ మీద వేసిన మట్టిని చీల్చుకుంటూ పైకి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోటార్ల ద్వారా ప్రస్తుతం నీటిని ఎత్తిపోసే ప్రక్రియ జరగకున్నా పైపులు పైకి లేవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు పైపులు పైకి రావడానికి కారణాలను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా ఇదే పంప్ హౌజ్‌కు చెందిన పైప్ లైన్ ఇలాగే పైకి తేలగా ఇంజినీర్లు హుటాహుటిన మట్టి పోసి పూడ్చారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం విశేషం. సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల పైప్ లైన్ తేలిందా లేక నిర్మాణ సమయంలోనే పకడ్భందీ చర్యలు తీసుకోకపోడం వల్ల జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story