భారీ వర్షాలతో సింగూర్ ఫుల్.. ఇక వ్యవసాయానికి ఢోకా లేదు..

by Shyam |   ( Updated:2021-09-06 08:15:45.0  )
భారీ వర్షాలతో సింగూర్ ఫుల్.. ఇక వ్యవసాయానికి ఢోకా లేదు..
X

దిశ, ఆందోల్: ఉమ్మడి మెద‌క్ జిల్లాకు త‌ల‌మానికంగా ఉన్న సింగూర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుని ప‌ర్యాట‌కుల‌తో సంద‌డి నెలకొంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వ‌ర‌ద రూపంలో వ‌ర్షపు నీరు వ‌చ్చి చేరుతుండ‌డంతో ప్రాజెక్టు నిండుకుండ‌లా మారింది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 8 టీఏంసీల‌ వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. వ‌ర‌ద ప్రవాహం రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రాజెక్టు సామ‌ర్థ్యం 29.97 టీఎంసీలు కాగా, సోమ‌వారం నాటికి ప్రాజెక్టులోకి 28 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వ‌ర‌ద రూపంలో 33 వేల క్యూసెక్కుల నీరు వ‌స్తుండ‌గా, దిగువ‌కు 8,626 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. కర్ణాటకలోని కరింజ ప్రాజెక్టు గేటు ఎత్తివేయడంతో సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

సింగూరు గేటు ఎత్తిన ఎమ్మెల్యే

సింగూరు ప్రాజెక్టులోకి 28 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో అధికారుల సూచన మేరకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రాజెక్టు 11వ గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. గేటు 1.5 మీటర్ ఎత్తుతో నీటిని వదలడంతో 8,626 క్యూ సెక్కుల నీరు దిగువకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. మంజీరా ప‌రివాహ‌క ప్రాంతాల అందోలు, పుల్కల్ మండ‌లాల గ్రామాల ప్రజ‌లు మంజీరా న‌ది పరివాహ‌క ప్రాంతం వైపు వేళ్లకూడ‌ద‌ని, వ్యవ‌సాయ క్షేత్రాల వైపు కూడా వెళ్లొద్దని ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ మురళిధర్, ఈఈ మధుసూధన్ రెడ్డి, కన్సల్టెట్ మల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు గోవర్ధన్, నాయకులు సంగమేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సాగుకు ఢోకా లేదు

సింగూర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకోవ‌డంతో సాగుకు ఢోకా లేదు. ప్రాజెక్టులో నుంచి నీటిని సాగుకు 16 టీఎంసీలు దాటితేనే వ‌ద‌లాల‌న్న నిబంధ‌న ఉంది. ప్రాజెక్టులో 28 టీఎంసీల‌ వరకు నీరు చేరుకోవ‌డంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదు. ఈ ప్రాజెక్టు నుంచి ఏడాదికి వ‌న‌దుర్గ ప్రాజెక్టకు (ఘ‌న‌పూర్‌) 4.06 టీఎంసీలు, నిజాంసాగ‌ర్‌కు 7 టీఎంసీలు, కాలువ‌ల ద్వారా అందోలు, పుల్కల్‌, స‌దాశివ‌పేట‌, మునిప‌ల్లి మండ‌లాల్లోని 150 చెరువులు నింపేందుకు గాను 2 టీఎంసీల నీటిని వ‌దలాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వ‌ర్షాల‌తో చెరువులు, కుంట‌ల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చిచేరుతుండ‌డంతో అవి కూడా నిండుకుండ‌లా మారాయి.

పర్యాటకుల సందడి..

సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆ ప్రాంత‌మంతా ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా మారింది. అందోలు, సంగారెడ్డి, జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్రాంతాల‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పర్యాటకుల సందడి మొదలైంది. నీటి ప్రవాహన్ని చూసేందుకు ప్రాజెక్టు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వ‌స్తున్నారు. ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన చిన్నచిన్న హోట‌ళ్లు, ఇత‌ర టిఫిన్ సెంట‌ర్‌లకు గిరాకీ బాగా పెరిగింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ప్రాజెక్టు మీదికి ఎవరిని అనుమ‌తించ‌డం లేదు. అధికారులు మాత్రం ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story