ఇండిపెండెన్స్ డే రోజున ‘సింపుల్ వన్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

by Harish |
ఇండిపెండెన్స్ డే రోజున ‘సింపుల్ వన్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఓలా స్కూటర్ కోసం వినియోగదారుల నుంచి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరుకే చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సింపుల్ వన్’ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆగష్టు 15న సాయంత్రం 5 గంటల నుంచి రూ. 1,947కే ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ‘సింపుల్ వన్ ఈ-స్కూటర్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటుందని ఆశిస్తున్నాం.

ఆగష్టు 15న తమ కంపెనీకి చారిత్రాత్మక రోజు అవుతుందని’ సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాల ప్రకారం.. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఆదరణ కలిగిన ఓలా స్కూటర్‌తో పాటు ఆథర్ ఎనర్జీ వారి 450ఎక్స్‌లతో పోటీపడనుంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ 4.8 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం 70 నిమిషాల్లో దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చని, ఒకసారి ఛార్జ్ చేసిన అనంతరం ఎకో మోడ్‌లో 240 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని వివరించింది. గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని ఈ స్కూటర్ అందుకుంటుందని, టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. దీని ధర రూ. లక్ష నుంచి రూ. 1.20 లక్షల్లోపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story