ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ జిల్లా కలెక్టర్ .. ? సోషల్ మీడియాలో పేరు వైరల్

by Shyam |   ( Updated:2021-11-13 10:29:05.0  )
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ జిల్లా కలెక్టర్ .. ? సోషల్ మీడియాలో పేరు వైరల్
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి‌కి రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు అధికార వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి సిద్దిపేట కలెక్టర్ పేరు తెరపైకి రావడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ పేరు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. సిద్దిపేట కలెక్టర్‌‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా దీనిపై అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సిద్దిపేట కలెక్టర్ కి ఎమ్మెల్సీ ఖాయమనే మాట జిల్లాలో జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కలెక్టర్ .. ?

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలన్నప్పుడల్లా సిద్దిపేట కలెక్టర్ పేరు ట్రోల్ అవుతుంది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటిస్తాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదలైంది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలు, మొత్తం 18 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో మంచి అభ్యర్థుల వేటలో ఉన్న అధిష్టానం సిద్దిపేట కలెక్టర్ పేరును ఖరారు చేసిందని, దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అనధికారిక సమాచారం.

గతంలోనూ పలుమార్లు తెరపైకి ..

ఎన్నికల సమయంలో సిద్దిపేట కలెక్టర్ పేరు బహిర్గతం కావడం మొదటి సారేమి కాదు. గతంలోనూ పలుమార్లు కలెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై ఏనాడు కలెక్టర్ ఖండించలేదు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో పటాన్చెరు ఎమ్మెల్యేగా టికెట్ ఆశించాడని ట్రోల్ కాగా, 2020 లో దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించినట్టు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలోనూ కలెక్టర్ ఏ మాత్రం స్పందించలేదు.

వివాదాల్లోనూ ..

పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పలుమార్లు వివాదాల్లో నిలిచారు. సీఎం కాళ్లు మొక్కడం మొదలు కొన్ని సార్లు అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడి పలుసార్లు వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల వరి విత్తనాల విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఓ హాట్ టాపిక్ గా మారాడు. కరోనా మాస్కు విషయంలో, ఇలా పలుమార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. అయినా ఇప్పటికి తన తీరు మార్చుకోవడం లేదు.

కలెక్టర్ పై నెటిజన్ల కామెంట్లు

సిద్దిపేట కలెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిద్దిపేట కలెక్టర్ అనే వార్త వైరల్ అవుతుంది. అయితే దీనిపై కొందరు నెటిజన్లు గతంలో వార్తలాగే ఇది కూడా ఫేక్ న్యూస్ అంటుండగా మరికొందరు కలెక్టర్ కు రాజకీయాల్లోకి రావాలని బాగా ఆసక్తిగా ఉన్నట్టుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్న కలెక్టర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గా ఉన్నత పదవిలో ఉంటూ రాజకీయా నాయకునిలా ప్రవర్తించడం సరికాదంటూ కలెక్టర్ తీరుపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా కలెక్టర్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఈ సారి ఖాయమే..

సీఎం కేసీఆర్ మెప్పు పొందిన అధికారిగా పేరున్న కలెక్టర్ కు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమనే తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సీఎం నుండి పలు సందర్భాల్లో ప్రశంసలు పొందారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి, సీఎం స్వగ్రామం చింతమడక లో ఆయన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు, అభివృద్ధి చేసిన పనులను అభినందించిన కేసీఆర్ ఈ సారి టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్టు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం నుండి అందుతున్న సమాచారం. కాగా కలెక్టర్ కు సైతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పని చేయాలని ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ గా గెలుపొందిన అనంతరం పలు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంతే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నారు. కాగా సిద్దిపేట కలెక్టర్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పదవి కాలం పూర్తవుతుంది. ఈ లోగానే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లో కి వస్తాడా, రిటైర్మెంట్ సమయం వరకు వేచి ఉంటాడా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

‘ఆర్కే బయోగ్రఫీ‌పై సర్కారు కుట్రలు’

Advertisement

Next Story

Most Viewed