AP News : వైసీపీ కోసం జగన్‌ కంటే షర్మిల ఎక్కువ కష్టపడ్డారు

by srinivas |   ( Updated:2021-09-27 08:04:13.0  )
raghurama
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ‌కంటే షర్మిలయే ఎక్కువగా కష్టపడ్డారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్న సమయంలో ఆమెకు మాకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించిన షర్మిలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తామందరి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిలకు.. వైసీపీకు సంబంధం లేదని చెప్పడం సరికాదన్నారు. అంతేకాదు వైసీపీలో తనకు సభ్యత్వమే లేదని షర్మిల చెప్పడం తాను దిగ్భ్రాంతికి గురయ్యానని రఘురామ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎంతో పాపులారిటీ ఉందని.. జగన్ సభలకు వచ్చినంత మంది జనం.. షర్మిల సభలకు కూడా వచ్చేవారని గుర్తు చేశారు. వైసీపీలో తనకే అన్యాయం జరిగిందని అనుకున్నానని.. వైఎస్ షర్మిలకు కూడా అన్యాయం జరిగిందని ఆమె మాటలను బట్టి అర్థమవుతుందని ఎంపీ రఘురామ అన్నారు.

బాత్‌రూమ్‌లు క్లీన్ చేసేందుకు వలంటీర్లను పంపుతారా?

సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్‌లో విక్రయించడం సరికాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సినిమా వ్యాపారం అనేది చాలా చిన్నదని దానిపై ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించడం అవసరమా అని నిలదీశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటిని గాలికొదిలేసి ఆన్‌లైన్ పోర్టల్‌పైనే ప్రభుత్వం దృష్టిపెట్టడం సరికాదన్నారు. సినిమా వాళ్లు ఎన్నైనా అడుగుతారని అన్నీ ఇచ్చేస్తారా అంటూ ప్రశ్నించారు. సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేసేందుకు వలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. వాళ్లకు ఇచ్చే రూ. 5వేలు మేమే ఇస్తాం. అంతకంటే తక్కువగా మాకు ఎవరూ దొరకడం లేదు అని అడిగితే పంపించేస్తారా అని నిలదీశారు. అడగడానికి వాళ్లెవరు?.. ఓకే చెప్పడానికి మీరెవరని ఎంపీ రఘురామ నిలదీశారు.

Advertisement

Next Story