పాదయాత్ర కోసం కడపలో తండ్రి ఆశీస్సులు తీసుకున్న షర్మిల

by srinivas |
Sharmila-125
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్టోబర్ 20నుంచి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ తండ్రి వైఎస్ఆర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైన షర్మిల మంగళవారం తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తల్లి వైఎస్‌ విజయమ్మ, ఇతర పార్టీ నేతలతో కలిసి ఆమె తండ్రి సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. షర్మిల పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతమవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లాగే వారి బిడ్డలకు కూడా ప్రజల ప్రేమ, అభిమానం, అండదండలు ఉంటాయని పలువురు నేతలు అన్నారు. అంతకు ముందు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు..అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చేసిన వైఎస్ షర్మిల అనంతరం రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున కాన్వాయ్‌తో ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ఆర్ ఘాట్‌ వద్దకు చేరుకుని తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.

నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయయ్మ

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం తన బిడ్డ వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపడుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. అక్టోబర్ 20న చేవేళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్రకు వైఎస్ షర్మిల శ్రీకారం చుడుతుందని, వైఎస్ఆర్‌ను ప్రేమించే ప్రతీ ఒక్కరూ ఆమె అడుగులో అడుగువేసి తన బిడ్డను ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే..అభిమానించే ప్రతీ ఒక్కరూ షర్మిలతో కలిసి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించాలని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.

400 రోజులు..4వేల కిలోమీటర్లు

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర బుధవారం నుంచి మొదలు కానుంది. చేవెళ్ల నుంచి 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల పొడవున యాత్ర సాగనుంది. మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించిన ఆమె తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని బుధవారం నుంచి యాత్ర స్టార్ట్ చేస్తారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ, 14 లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో 14 నెలలు పాదయాత్ర జరుగుతుందని వైఎస్ఆర్టీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బుధవారం చేవెళ్లలో బహిరంగసభలో పాల్గొన్నాక షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రోజూ ఉదయం 8.30 నుంచి 12.30 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల దాకా 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. యాత్ర చేవెళ్లలో మొదలై రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 రోజులు సాగాక దేవరకొండ వద్ద నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో 20 రోజులుంటుంది. ప్రతి మంగళవారం సాగిన నిరుద్యోగ దీక్ష యాత్రలోనూ కొనసాగుతుందని పార్టీ ప్రకటనలో తెలియజేసింది.

Advertisement

Next Story