- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంటిమెంట్ నినాదంతో షర్మిల అరంగేట్రం..!!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరోసారి ‘జై తెలంగాణ’ నినాదం తెరపైకి వచ్చింది. రాయలసీమకు చెందిన షర్మిల తనంతట తానుగా తెలంగాణ కోడలినని చెప్పుకుంటూ ‘జై తెలంగాణ’ నినాదంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో శనివారం లోటస్‌పాండ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పై నినాదాలు చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలంటే ఏం చేయాలో వారి నుంచి సూచనలు, అభిప్రాయాలను తీసుకున్నారు. వైఎస్సార్ కలలుగన్న రాజన్న రాజ్యం, సంక్షేమ పాలన కావాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ పదకొండు ప్రశ్నలను వారి ముందు ఉంచారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిల ‘జై తెలంగాణ’ సెంటిమెంట్ నినాదంతో ప్రజలకు దగ్గర కావాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతతో పాటు వైఎస్సార్ పట్ల ఉన్న అభిమానాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలో ఉనికిలోకి వచ్చిన పథకాలను ఆమె ఏకరువు పెడుతున్నారు. ఇప్పుడు అవి అమలవుతున్న తీరును ప్రస్తావిస్తూ మళ్ళీ అప్పటి రోజులు, పాలన రావాలంటే ఏం చేయాలో అభిమానుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
షర్మిల ప్రస్తావించిన పదకొండు అంశాలు ఇవే :
1. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాటిని ఎలా అధిగమించాలి?
2. మీమీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేసిన పనులు, పథకాలేంటి? వాటి ద్వారా ఏ మేరకు లబ్ధి పొందారు?
3. ఇప్పుడు మనం తీసుకుంటున్న రాజకీయ నిర్ణయంపై మీ దగ్గరలోని ప్రజలు ఏమనుకుంటున్నారు? వారిలో ఎలాంటి అభిప్రాయం ఉంది?
4. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి?
5. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని ఎలా ఎదుర్కొంటాం?
6. తెలంగాణ ప్రజలు ఇప్పుడు పార్టీల నుంచి, ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారు? వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలేంటి? వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి?
7. తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడానికి మన పోరాట వ్యూహం ఎలా ఉండాలి?
8. జిల్లా స్థాయిలో మన పార్టీ తరఫున పోరాటం ఏ తీరులో ఉండాలి? ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి?
9. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన పార్టీ తరఫున ఎలాంటి పోరాటాలు ఉండాలి?
10. పార్టీ సంస్థాగతంగా బలపడాలంటే ఏయే అంశాలపై మనం ఫోకస్ పెట్టాలి? ప్రజలకు ఎలా దగ్గరవ్వాలి? మన పార్టీ తరఫున కార్యాచరణ ఎలా ఉండాలి?
11. వైఎస్సార్ కలలుగన్న సంక్షేమ రాజ్యం రావాలంటే మనం ఏం చేయాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి?
రాజన్న రాజ్యం ఎక్కడుంది?
“వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ గొప్ప చదువులు ఉచితంగా లభించాలనుకున్నాడు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించాడు. ప్రతీ రైతు రాజు కావాలనుకున్నాడు. ప్రతీ పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నాడు. అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా ఇవ్వాలనుకున్నాడు. స్వ,త ఇల్లు లేని ప్రతీ కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో చేశాడు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే ఆ మహానేత చనిపోయినప్పుడు దుఃఖం భరించలేక ప్రాణాలు కొల్పోయినవారిలో తెలంగాణవారే అధికంగా ఉన్నారు” అంటూ ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘జై తెలంగాణ… జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణలో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని, ఆ సంక్షేమ పాలన తేవాలనేదే తన కోరిక అని అన్నారు. ”వైఎస్సార్ అభిమానులుగా మీరందరూ తోడుంటే అది సాధ్యమనేదే నా నమ్మకం. రాజన్న బిడ్డగా ఇచ్చిన పిలుపుతో ఈ రెండు జిల్లాల ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. మీకు తోడుంటాం అని చెప్పడానికి వచ్చారు. రాజన్న బిడ్డగా శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. మీమీ ప్రాంతాల్లో మీ చుట్టూ ఉన్నవారు ప్రస్తుత ప్రభుత్వంపై ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు? పేదలు ఎలా ఉన్నారు? ప్రభుత్వం వారి కోసం ఏమైనా చేస్తున్నదా? పేదలు సంతోషంగా ఉన్నారా? మన వాళ్ళు ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి?” అంటూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
టీఆర్ఎస్ హామీలన్నీ నీటి మీద రాతలే : కొండా రాఘవరెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలకు టీఆర్ఎస్ పాలనలో పెద్దగా ఒరిగిందేమీ లేదని, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని షర్మిల పార్టీ వ్యవహారాలను చూస్తున్న కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందటం లేదని, ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ నగరం ఇటీవలి భారీ వర్షాలతో సముద్రం లాగా మారిందని, వేలాది ఇండ్లు మునిగి పోవడానికి ప్రధాన కారణం భూ కబ్జాలేనని, వాటిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో వర్షం నీళ్లు మూసీ నదిలో కలవడం కోసం వైఎస్సార్ ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక శ్రద్ద చూపారని గుర్తుచేశారు.
టీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీ ఒక బూటకమని, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించి దోపిడీ కోసమేనని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యంగామార్చారని, వైఎస్సార్ హయాంలో వినిపించిన 109 అంబులెన్స్ సైరన్‌లు ఇప్పుడు వినిపించడంలేదన్నారు. ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైనా అందులోకి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ముస్లింలకు దక్కిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఏమయ్యయని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రజలు షర్మిల వెనక ఉంటారని, మూడు జిల్లాల అభిమానులతో మీటింగుల తర్వాత షర్మిలకు చాలా క్లారిటీ వచ్చిందన్నారు.
టీఆర్ఎస్ పాలనపై ప్రజల అసంతృప్తి
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానుల నుంచి వెల్లడైన అభిప్రాయాలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తోందని, దొరల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప, ఎవరూ హ్యాపీగా లేరని, దళితులకు అన్యాయం జరుగుతోందని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందని, ఫీజు రీఇంమర్స్‌మెంట్ మాటే వినిపించడం లేదని, ఆ పథకం నిర్వీర్యమైపోయిందని, ముస్లిం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని, ఆరోగ్య శ్రీ పథకంలో ట్రీట్‌మెంట్ దొరికే జబ్బులను ప్రభుత్వం తొలగించిందని, ఉద్యమకారులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందని.. ఇలా అనేక అంశాలను షర్మిల దృష్టికి తీసుకెళ్ళారు.
వైఎస్సార్ హయాంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచినా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదని ఆమెకు గుర్తుచేశారు. గ్రామాల్లో యువత కొత్త పార్టీ పట్ల ఆసక్తిగా ఉన్నారని, అలాంటి ఔత్సాహికులకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు. పార్టీ ప్రారంభానికి ముందే కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, కొంతమంది ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు మొండిచేయి చూపిన కేసీఆర్ వారి కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప అన్ని ప్రాజెక్టులనూ కేసీఆర్ విస్మరించారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని, బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనని అన్నారు. తెలంగాణకు కాబోయే మహిళా ముఖ్యమంత్రి వైఎస్ షర్మిల కావాలని ఆకాంక్షించారు.