‘కేసీఆర్ నీ ఛాతిలో ఉన్నది గుండెనా.. బండ‌నా’

by Shyam |   ( Updated:2021-04-15 03:40:39.0  )
‘కేసీఆర్ నీ ఛాతిలో ఉన్నది గుండెనా.. బండ‌నా’
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : నోటిఫికేష‌న్లు లేక నిరుద్యోగులు బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడుతుంటే దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు సీఎం కేసీఆర్ తీరు ఉంద‌ని వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఇందిరాపార్క్ వేదిక‌గా గురువారం చేప‌ట్టిన ఉద్యోగ దీక్షలో ష‌ర్మిల మాట్లాడుతూ.. 40 ల‌క్షల మంది నిరుద్యోగులు నోటిఫికేష‌న్ కోసం ఎదురు చూస్తున్నార‌ని అన్నారు. కొంద‌రు యువ‌కులు ఉద్యోగాలు రావ‌ని నిరాశ‌తో ఆత్మహ‌త్యల‌కు పాల్పడుతున్నార‌ని ఆమె ఆవేద‌న వ్యక్తంచేశారు.

ఇటీవ‌ల కేయూలో సునీల్ నాయ‌క్ చావుతోనైనా నోటిఫికేష‌న్లు రావాల‌ని పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డాడ‌ని, అత‌డే కాకుండా సిరిసిల్లకు చెందిన మ‌హేంద‌ర్ యాద్‌వ్, న‌ల్లగొండ‌కు చెందిన సంతోష్ కుమార్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు స‌రిపోద‌ని ష‌ర్మిల అన్నారు. ఇంత జరుగుతున్నా దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ పరిస్థితి త‌యారైంద‌ని. ఉద్యమ సమయంలో కేసీఆర్ మొసలి కన్నీరు కార్చార‌ని ఆమె విమ‌ర్శలు చేశారు. నోటిఫికేష‌న్లు లేక ఇంతమంది యువకులు చనిపోతుంటే కేసీఆర్ కి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఛాతీలో ఉన్నది.. గుండెనా.. బండనా.. కొంచెం కూడా క‌నిక‌రం లేదా అని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ఈ పరిస్థితి మారాల‌న్నారు.

లక్ష 90 వేల ఖాళీలున్నాయి..

తెలంగాణ‌లో లక్ష 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంద‌ని చెప్పిన ష‌ర్మిల ఈ విష‌యంలో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ప్రశ్నించినా, ప్రశ్నించక‌పోయినా నిరుద్యోగుల తరుపున పోరాడ‌తాన‌ని అన్నారు. ఆత్మహత్యలకు బాధ్యుడు కేసీఆర్ కాదా.. నోటిఫికేషన్లు ఇస్తే వారు బతికేవారు కదా అని ష‌ర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పి, క్షమాపణ అడగాల‌ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల‌కు న్యాయం జరిగేవ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు చేస్తూనే ఉంటామ‌ని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాల‌ని ఆమె పేర్కొన్నారు.

నా దీక్ష 72 గంటలు కొనసాగిస్తా

పోలీస్ శాఖ గురువారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి ఇవ్వగా ష‌ర్మిల త‌న దీక్షను 72 గంట‌ల పాటు కొన‌సాగిస్తాన‌న‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఆమె దీక్షను ఇందిరా పార్క్ వేదిక‌గానే కొన‌సాగిస్తారా.. లేదా లోట‌స్ పాండ్ నుంచి కొన‌సాగిస్తారా అనే విష‌యంపై స్పష్టత రావాల్సి ఉంది. త‌న మూడు రోజుల దీక్ష అనంత‌రం నాలుగు రోజు నుంచి జిల్లాల వారీగా రిలే దీక్షలు కొన‌సాగుతాయ‌ని ఆమె పేర్కొ‌న్నారు.

అంద‌రూ స్టేజీపై నుంచి దిగండి..

ష‌ర్మిల దీక్ష చేప‌డుతున్న స్టేజీపై నుంచి అంద‌రూ దిగిపోవాల‌ని నాయ‌కులు, కార్యక‌ర్తల‌ను ఆమె హెచ్చరించారు. ఈ సంఘ‌ట‌న‌తో అక్కడేం జ‌రుగుతుందోన‌ని అంద‌రూ షాక్ కు గుర‌య్యారు. స్టేజీ మీద‌కు ఎవ‌రొచ్చినా మీకు మూడిన‌ట్లేన‌ని సెక్యూరిటీకి ష‌ర్మిల వార్నింగ్ ఇచ్చారు. కాగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డంలో భాగంగానే ష‌ర్మిల ఈ వ్యాఖ్యలు చేసిన‌ట్లు కార్యాల‌య‌వ‌ర్గం ప్రక‌టించింది.

Advertisement

Next Story