పింఛన్ కావాలంటే పక్కలోకి రావాలట..

by Anukaran |
పింఛన్ కావాలంటే పక్కలోకి రావాలట..
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచి నాయకుడు, మనసున్న వాడని ఓట్లేసి అధికారం చేతికిస్తే.. నా ‘కోరిక’తీర్చితేనే మీ అవసరాలు తీర్చుతానని మొండి పట్టుపడుతున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆయన భార్య శివాలెత్తుతోంది.. గ్రామ పెద్దలు సైతం డబ్బులు ఇస్తాం నోరు మూసుకోమంటున్నారు. దివ్యాంగుడైన కుమారుడికి వికలాంగుల పింఛన్ ఇవ్వాలని అడిగిన ఓ మహిళా పట్ల ఆ గ్రామ ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు ఇది. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ నాయకుడికి ఇల్లాలు, గ్రామపెద్దలు వత్తాసు పలకడం గమనార్హం.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ‘కామ’పాలకుల మద పిచ్చిని బయటపెడుతోంది. గ్రామానికి చెందిన మహిళ తన కుమారుడికి వికలాంగుల పింఛన్ ఇప్పించాలని అధికార పార్టీ నాయకుడి దగ్గరకు వెళ్లింది. అయితే పింఛన్ కావాలంటే నువ్వు నా పక్కలోకి రావాలని సదరు నాయకుడు ఆమెకు ఖరాఖండిగా చెప్పేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా.. విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు ఆ నాయకుడికే వత్తాసు పలుకుతూ రూ.8 వేలు ఇస్తాం నోరుమూసుకో అని తీర్చునిచ్చారు. నాయకుడి భార్య సైతం భర్త పక్షాన నిలిచి.. బాధిత మహిళపై దాడికి యత్నించడం గమనార్హం.

దీనిపై వారం రోజుల క్రితమే నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని బాధిత మహిళ ఆరోపిస్తోంది. పింఛన్ అడిగినందుకు తన కామ కోర్కెలు తీర్చాలని కోరిన నాయకుడికే గ్రామపెద్దలు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తోంది. ఏది ఏమైనా ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు తన సుఖం తీర్చమని అనడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకులకు ఈ ‘వ్యవహారం’పరిపాటిగా అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story