నా వయస్సు 16.. సెక్స్‌లో పాల్గొంటున్నట్లు కలలు వచ్చి నిద్రలోనే వీర్య స్ఖలనం అవుతోంది

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-11-09 14:24:20.0  )
నా వయస్సు 16.. సెక్స్‌లో పాల్గొంటున్నట్లు కలలు వచ్చి నిద్రలోనే వీర్య స్ఖలనం అవుతోంది
X

మేడమ్! నా వయస్సు 16 సంవత్సరాలు. నాకు నిద్రలో వీర్యం పోతోంది. దానివల్ల నీరసంగా ఉంటుందని, మొటిమలు వస్తాయని, పిల్లలు పుట్టరని ఫ్రెండ్స్ చెబుతున్నారు. దీంతో ఆందోళనకు, భయానికి గురవుతున్నాను. నిద్రలో వీర్య నష్టం ఎటువంటి సెక్స్ సమస్యలను కలిగిస్తుంది? ఈ వ్యాధికి చికిత్స లేదా? ఈ సమస్య వల్ల నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను.

నా వయస్సు 22 సంవత్సరాలు. పీజీ చేస్తున్నాను. నా సమస్య ఏమిటంటే నాకు ఒక ఆరేడు సంవత్సరాల నుంచి నిద్రలో వీర్యం పోతున్నది. సెక్స్ పాల్గొంటున్నట్లు కలలు వచ్చి వీర్యం దానంతటదే విడుదలవుతోంది. ఎన్నో యునానీ, అయుర్వేదం, హోమియో మందులు వాడాను. కానీ, తగ్గట్లేడు, నేను సన్నగా అయిపోయాను. నీరసంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటాను. రాత్రి నిద్రలో వీర్యం పోకుండా ఆపేదెలా? ఈ జబ్బు నాకు తగ్గుతుందా?

సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఇప్పటి తరం యువత ఎంతో అజ్ఞానంలో ఉంటున్నారు. ఇది వారిలో భయాన్ని, ఆందోళనను, నెగెటివ్ ఆలోచనా ధోరణిని పెంచుతూ అభద్రతా భావనకు లోను చేస్తోంది. నిజానికి వీర్యం ప్రతి రోజూ బీర్జాల్లో తయారవుతూనే ఉంటుంది. మూత్రమూ, చెమటలాగా అది కూడా శరీరం నుంచి బయటకు విసర్జింపబడాల్సిందే. అయితే, హస్తప్రయోగం ద్వారా లేదా భార్యతో సెక్స్‌లో పాల్గొనడం ద్వారా ఈ రెండు పద్ధతుల్లో వీర్యం పోకపోతే రాత్రి నిద్రలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ విడుదలవుతాయి. మెదడు ఇచ్చే సంకేతాలకి అంగస్థంభన, వీర్య స్థలనం అవుతాయి. నిండిపోయిన నీళ్లబిందెలో నీళ్లు ఎలాగైతే పొంగుతాయో బీర్జాలలో అదే జరుగుతుంది. వివాహితులలో, వారానికి 3-4 సార్లు హస్తప్రయోగం చేసుకొనేవాళ్లలో ఇది తక్కువ. వీటిని ‘స్వప్న స్ఖలనాలు’ లేదా ‘నైట్ ఎమిషన్స్’ అంటారు. ఇది చాలా సహజమైంది. ఇది మనిషి సాధారణ శృంగార చక్రాలలో ఒక భాగం మాత్రమే.

వీర్యం ఇలా పోవటం వల్ల నీరసంగా, బక్కగా అవటం, మొటిమలు రావడం, సెక్స్ సమస్యలు వంటివేవీ జరగవు. ఇవి చాలా అశాస్త్రీయమైన భయాలు, అపోహలు మాత్రమే. ఎందుకంటే వీర్యం బలవర్ధక పదార్థం ఏమాత్రమూ కాదు. అది బీర్జాల్లోనే ఉండటం వల్ల బలమూ రాదు. మూత్రంలాగా ఇది కూడా విసర్జక పదార్థం మాత్రమే. పెళ్లికి ముందు అది దేనికీ పనికి రాదు. పెళ్లి తర్వాత వీర్యంలోని వీర్యకణాలు సంతానం కోసం మాత్రమే పనికి వస్తాయి. పెళ్ళయిన తర్వాత దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడూ వీర్యం పోతుంది. దానివల్ల వివాహిత పురుషులకి ఏ మాత్రమూ ఆరోగ్యరీత్యా నష్టం కలగటం లేదు కదా?

మీకు కలిగే నీరసం కేవలం వీర్య స్థలనం ద్వారా ఆరోగ్య- సెక్స్ సమస్యలు వస్తాయన్న భయం వల్ల మాత్రమే. నిజానికి నిద్రలో అంగస్తంభన, వీర్య స్థలనం, పురుషుడి లైంగిక అవయవ పని తీరు, శృంగార హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉన్నాయని తెలియచెప్పే పాజిటివ్ లక్షణాలు మాత్రమే. అంటే, ఏ సెక్స్ లోపమా లేదని చెప్తాయి ఈ లక్షణాలు. నిద్రలో వీర్య స్థలనం ఒక సహజమైన లైంగిక ప్రక్రియ. జబ్బు ఏ మాత్రమూ కాదు. నిద్రలో స్ఖలనం జరుగుతుంటే లైంగిక ఆర్యోగం సక్రమంగా ఉందని సంతోష పడాలి. అంతేకానీ అజ్ఞానంతో ఆందోళనా, భయాలకు గురికావద్దు. మల, మూత్ర, చెమటలు, లాలాజలం శరీరం నుంచి విసర్జింపబడుతుంటే లేని ఆందోళన వీర్యం విసర్జింపబడుతుంటే కూడా ఉండకూడదు.

నిద్రలో వీర్యస్ఖలనం జబ్బు కాదు, కాబట్టి దీనికి ఏ చికిత్సా అవసరం లేదు. ఏదో ఒక చికిత్స తీసుకున్నా నిద్రలో వీర్యస్ఖలనం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే, వీర్యస్థలనం నిద్రలో కానీ, హస్తప్రయోగం వల్ల కానీ, భార్యతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కానీ, ఏ పద్ధతిలో కానీ అది జబ్బు కాదు. అదొక శరీర సహజ ధర్మం.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed