- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం
దిశ, కరీంనగర్ సిటీ : వర్షాలు పడుతున్నాయంటే అందరికన్నా ముందుగా హర్షించేది రైతు. అయితే, ఇప్పుడు అదే రైతు వేళా పాళా లేని వానలు తమకొద్దంటూ, వరుణదేవునికి మొక్కుతున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట వడగండ్ల పాలవుతుండగా, ఆదుకునే దిక్కు లేక అన్నదాత అఘోరిస్తున్నాడు. అకాల వర్షాలతో రైతుల నోటికాడి బుక్క నీటి పాలవుతుండగా, పరిహారమందించి ఆదుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం, వారి జీవితాలతో ఆడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల గోడు పట్టించుకోకుండా చోద్యం చూస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది అనూహ్యంగా కురిసిన వర్షాలతో, సాధారణానికి మించి అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో, పంట పొలాలు తీవ్రంగా ధ్వంసం కాగా, చేతికందిన పంటలు సైతం నీటిపాలయ్యాయి. రైతాంగానికి భారీ నష్టం జరిగింది. ఆదుకుంటామని ప్రకటన చేసిన ప్రభుత్వం, నష్టంపై నివేదికలు అందజేయాలంటూ ఆదేశించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.18 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు అందజేశారు. నెలలు గడిచినా ప్రభుత్వ నేతలు ఆ ఊసే ఎత్తకపోవటంతో, పరిహారం వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. కొద్దిరోజులుగా పడుతున్న అకాల వర్షాలతో, తిరిగి జిల్లా అధికారులు పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ సారైనా ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుందా? లేదా? అనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షంతో పంటలు నష్టపోగా, బాధ్యతగా వ్యవహరించిన వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాలను అంచనా వేశారు. కరీంనగర్ జిల్లాలో 1,87,500 ఎకరాల్లో యాసంగి సాగు చేయగా, ఇందులో 60,649 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మొన్న కురిసిన అకాల వర్షాలతో 2,596 ఎకరాల్లో వరి పంట దెబ్బతిని 986 మంది రైతులు నష్ట పోయినట్లు అధికారుల అంచనా.
అలాగే, సిరిసిల్ల,పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో కూడా 4వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తుంది. గతంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్న ప్రభుత్వం, ఆ హామీని ఆటకెక్కించగా, తాజా పరిస్థితులపై ఇప్పటివరకు స్పందించకపోవటంపట్ల అన్నదాతలు మండిపడుతున్నారు. పంట నష్ట పరిహారంపై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడం, ఏటా రెండుసార్లు అందిస్తున్న రైతు బంధు పెట్టుబడికి కూడా సరిపోకపోవటం, మరోవైపు బ్యాంకర్లు కూడా పంట రుణాలందించటంలో కనబరుస్తున్న నిర్లక్ష్యం మూలంగా, రైతులు అప్పుల చేయక తప్పటం లేదు. రైతుబంధు పథకం అమలు నేపద్యంలో, పరిహారం అందించటంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈక్రమంలో పంట నష్టం అంచనాలు కూడా వేయకపోతే పరిహారంపై ఆశలు వదులుకుని వారమని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పంట నష్ట పరిహారం విడుదలపై ప్రకటన చేయాలని జిల్లా రైతాంగం కోరుతుంది.