ఫేక్ న్యూస్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయండి

by Shamantha N |
supreme court
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో నిర్వహించిన తబ్లిఘీ సదస్సుకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రసారం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లకు వివరణగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ మీడియా సంస్థలపై తీసుకున్న చర్యలను వివరించాల్సిందిగా ఆదేశించామని, కేబుల్ టీవీ యాక్ట్ కింద ఏ చర్యలు తీసుకున్నారని తెలపాల్సిందిగా సూచించామని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ, ఆ ప్రశ్నలకు సమాధానాలే లేవని ఆగ్రహించింది.

మీడియా చానెళ్లు నకిలీ వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకోవడానికి, వాటిని నియంత్రించడానికి వ్యవస్థ లేకుంటే కొత్తగా ఏర్పాటు చేయండని ఆదేశించింది. అంతేకానీ, ఎన్‌బీఎస్ఏను ఎందుకు అడగటమని ప్రశ్నించింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ అసంతృప్తిని కలుగజేసిందని సీజేఐ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. తబ్లిఘీ సదస్సుతో కరోనా వ్యాప్తిని ముడిపెట్టి చేసిన విషప్రచారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సదరు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాయి. ఈ విచారణలో మీడియాకు అనుకూలంగానే కేంద్రం స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed