దిగొచ్చిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం

by Harish |   ( Updated:2021-10-14 05:29:50.0  )
vegetables
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ముడి పెట్రోలియం పెరిగినప్పటికీ ఆహార పదార్థాల ధరలను నియంత్రించడం ద్వారా గతం కంటే ఈ నెలలో హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) 10.66 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఇది 11.39 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న డబ్ల్యూపీఐ సూచీ సెప్టెంబర్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ వరుసగా ఆరో నెలలో కూడా రెండు అంకెల స్థాయిలోనే నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.32 శాతంగా నమోదైంది. ముడి పెట్రోలియం, మెటల్, ఆహారేతర వస్తువులు, రసాయనాలు, సహజ వాయువుల ధరలు పెరిగినందువల్లే ద్రవ్యోల్బణం రెండు అంకెలకుపైనే కొనసాగుతున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆహార ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధరల తగ్గుదలతో వీటి ధరలు దిగొచ్చాయని గణాంకాలు తెలిపాయి. పప్పు ధాన్యాల హోల్‌సేల్ ధరలు 9.42 శాతంగా ఉన్నాయి. ఇంధన ద్రవ్యోల్బణం 24.91 శాతం, విద్యుత్ ద్రవ్యోల్బణం 26.09 శాతంగా ఉన్నాయి. ముడి చమురు, సహజవాయువు ద్రవ్యోల్బణం 40.03 శాతం నుంచి 43.92 శాతానికి పెరిగింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 11.41 శాతంగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed