భారీ నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్లు

by Harish |
భారీ నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎట్టకేలకు సోమవారం నాటి వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గత కొన్ని వారాలుగా వరుసగా సోమవారాల్లో పతనమవుతున్న సూచీలు లాభాలను సాధించగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మద్ధతు నేపథ్యంలో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారని, ట్రేడింగ్ మొదలు నుంచి చివరి వరకు స్టాక్ మార్కెట్లు అధిక లాభాల వద్దే కొనసాగడం ఊరట కలిగించినట్టు విశ్లేషకులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సంబంధిత వార్తలతో మిడ్-సెషన్ సమయంలో డీలా పడుతుందని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ సూచీలు తలొగ్గలేదు. అమెరికా మార్కెట్లు లాభాలను సాధించడం, ఆసియ మార్కెట్లు మెరుగ్గా ర్యాలీ చేయడంతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చినట్టు నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ సరైన బాటలోనే ఉందన్న నిపుణులు అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ధైర్యాన్ని నింపింది.

వీటికి తోడు కేంద్రం మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కావాల్సిన వేగవంతమైన చర్యలపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 508.06 పాయింట్లు ఎగసి 48,386 వద్ద ముగియగా, నిఫ్టీ 143.65 పాయింట్ల లాభంతో 14,485 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా రంగం షేర్లు మినహాయించి రియల్టీ 4 శాతం లాభాలను దక్కించుకోగా, బ్యాంక్, ఫైనాన్షియ సర్వీసెస్, మెటల్, పీఎస్‌యూ బ్బ్యాంక్, సూచీలు 1 శాతం పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, రిలయన్స్ షేర్లు అధిక లాభాలను సాధించగా, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74. 73 వద్ద ఉంది.

Advertisement

Next Story