Stock Exchange: 51 వేల మార్కును దాటిన సెన్సెక్స్!

by Harish |   ( Updated:2021-05-26 06:34:19.0  )
Stock Exchange: 51 వేల మార్కును దాటిన సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. ఉదయం నిలకడగా మొదలైన తర్వాత పుంజుకున్న సూచీలు కొనుగోళ్ల మద్దతుతో చివరి వరకు మెరుగైన లాభాలను నమోదు చేశాయి. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న సంకేతాల వార్తల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ (Sensex)ఇండెక్స్ గతేడాది మార్చి తర్వాత మొదటిసారిగా 51 వేల మార్కును అధిగమించింది. దేశీయంగా కరోనా ప్రభావం తగ్గుతుండటం, కీలక రంగాల షేర్లు మెరుగ్గా ర్యాలీ నిర్వహించడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు తెలిపారు.

ప్రధానంగా ఐటీ, రియల్టీ, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 379.99 పాయింట్లు ఎగసి 51,017 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 93 పాయింట్లు లాభపడి 15,301 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 2 శాతం బలపడగా, రియల్టీ, మీడియా, ఆటో, ఫైనాన్స్ ఇండెక్స్‌లలో కొనుగోళ్లు పెరిగాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టీసీఎస్, సన్‌ఫార్మా షెర్లు అధిక లాభాలను సాధించగా, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, డా రెడ్డీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 72.70 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed