2021లో మార్కెట్ల అతిపెద్ద సింగిల్ డే పతనం!

by Shyam |
2021లో మార్కెట్ల అతిపెద్ద సింగిల్ డే పతనం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల అండతో గురువారం సెన్సెక్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 50 వేల మార్కును చేరుకున్నప్పటికీ, అనంతరం లాభాల స్వీకరణతో వెనక్కి తగ్గాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ నష్టాలతోనే మొదలయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవడంతో మార్కెట్లు భారీగా నష్టాలను చూశాయి. ఉదయం నుంచే భారీ అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరి వరకు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యే కదలాడాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేలకు దిగుమకు జారిపోయింది. నిఫ్టీ కూడా 14,500 స్థాయిని కోల్పోయి 2021లో అతిపెద్ద సింగిల్ డే పతనాన్ని చవిచూశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 746.22 పాయింట్లు కోల్పోయి 48,878 వద్ద ముగియగా, నిఫ్టీ 218.45 పాయింట్లు నష్టపోయి 14,371 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా మెటల్ రంగం 4 శాతం కుప్పకూలగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, ఫార్మా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు నీరసించాయి. ఆటో రంగం మాత్రమే బలపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.95 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed