లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత వారాంతం కోవిడ్-19 కొత్త వేరియంట్ భయాలు ముంచెత్తడంతో కుప్పకూలిన తర్వాత సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు పుంజుకున్నాయి. దేశీయంగా సానుకూల సంకేతాలు ఉండటంతో పాటు దీర్ఘకాలానికి స్టాక్ మార్కెట్లపై మదుపర్ల విశ్వాసం బలంగా ఉండటంతో కొనుగోళ్లు మెరుగ్గా జరిగాయి. అయితే చివరి గంట వరకు అధిక లాభాల్లో కదలాడిన తర్వాత చివర్లో ఓ మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. మొదట అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాలతో మొదలైనప్పటికీ అరగంట వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. దేశీయ పరిణామాలే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా టెలికాం కంపెనీలు టారిఫ్ పెంపును ప్రకటించడంతో పాటు ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాకు సంబంధించి ఆర్‌బీఐ ప్రతిపాదనలు, ముడి చమురు ధర దిగి రావడం లాంటి పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 153.43 పాయింట్లు పెరిగి 57,260 వద్ద, నిఫ్టీ 27.50 పాయింట్లు లాభపడి 17,053 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ 2 శాతం పతనమవగా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా, ఆటో రంగాలు దిగజారాయి.

ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను సాధించగా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లె ఇండియా, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, డా రెడ్డీస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.08 వద్ద ఉంది.

Advertisement

Next Story