వరుస నష్టాలతో 59 వేల దిగువకు సెన్సెక్స్

by Harish |
Stock market
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు తప్పట్లేదు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి గరిష్ఠాలను చేరుతున్న సూచీలు ఈ వారంలో వరుస నష్టాలతో కుదేలయ్యాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కూడా దేశీయ కీలక రంగాల్లో దిద్దుబాటు చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావడంతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరుగుతుండటంతో మదుపర్లు ద్రవ్యోల్భణ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇంధన ధరలు పెరిగితే దేశవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం ఉంటుందని అంచనా.

ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 59 వేల దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 360.78 పాయింట్లను కోల్పోయి 58.765 వద్ద క్లోజయింది. నిఫ్టీ 86.10 పాయింట్లు నష్టపోయి 17,532 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అధికంగా 2 శాతం దిగజారింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు నీరసించాయి. మరోవైపు, ఫార్మా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, డా రెడ్డీస్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed