నిన్న లాభం..నేడు నష్టం..మార్కెట్లకు తప్పని కష్టాలు!

by Harish |
నిన్న లాభం..నేడు నష్టం..మార్కెట్లకు తప్పని కష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభనకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదనే భయాల మధ్య పెట్టుబడిదారుల అమ్మకాలు జోరు పెంచారు. మంగళవారం నాటి లాభాలన్నీ బుధవారం తుడిచిపెట్టుకుపోయాయి. అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి కొనసాగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం ఉంటుందనే ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ సంకేతాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఉదయం ప్రారంభమే నష్టాలను చూసిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేక అధిక నష్టాలతో క్లోజయ్యాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1203.18 పాయింట్ల నష్టంతో 28,265 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 343.95 పాయింట్లు నష్టపోయి 8,253 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, టైటాన్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా మిగిలిన సూచీలన్నీ నష్టాలను నమోదు చేశాయి.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. నేటితో విలీనం అమలు కానున్న నేపథ్యంలో మదుపర్లలో ప్రతికూల సంకేతాలు మొదలయ్యాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఫినాన్సియల్ షేర్లు కూడా భారీ నష్టాలను చూస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 4.92 శాతం నష్టాలను నమోదు చేయగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్విసెస్ సైతం 4 శాతం పడిపోయింది.

వీటికి తోడు మార్చి నెల ఆటో రంగంలో వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. మారుతీ సుజుకీ ఏకంగా 47 శాతం పడిపోగా, ఐషర్ మోటర్స్ 82.7 శాతం పడిపోయాయి. అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 90 శాతం తాగ్గాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed