వ్యాక్సిన్‌పై ఆశలతో లాభపడ్డ సూచీలు!

by Harish |
వ్యాక్సిన్‌పై ఆశలతో లాభపడ్డ సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ ఉత్సాహం మొదలైంది. గత వారం కొంత డీలాపడినప్పటికీ తర్వాత పుంజుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించి సానుకూల వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. దీంతో దేశీయ మార్కెట్లు సైతం సోమవారం లాభాలను కొనసాగించాయి. ఉదయం ప్రారంభించిన తర్వాత భారీగా ర్యాలీ చేసినప్పటికీ, చివరి గంటలో లాభాల స్వీకరణ మొదలవడంతో లాభాలు తగ్గాయి.

కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి వస్తున్న సంకేతాలతో మార్కెట్ల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఆర్‌బీఐ అంతర్గత కమిటీ తాజాగా ఇచ్చిన ప్రతిపాదనల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ, ఫైనాన్స్ రంగాల షేర్లకు డిమాండ్ పుంజుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 194.90 పాయింట్లు లాభపడి 44,077 వద్ద ముగియగా, నిఫ్టీ 67.40 పాయింట్ల లాభంతో 12,926 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా, ఆటో, ఐటీ, రియల్టీ, మెటల్ రంగాలు స్వల్పంగా బలపడగా, బ్యాంకింగ్ రంగం షేర్లు డీలాపడ్డాయి. సెంన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, హెచ్‌సీఎల్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.03 వద్ద ఉంది.

Advertisement

Next Story