నకిలీ పాసుపోర్టుల వెనుక రాజకీయనేతల హస్తం..?

by Anukaran |
నకిలీ పాసుపోర్టుల వెనుక రాజకీయనేతల హస్తం..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోదన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాసుపోర్టుల జారీలో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు దుమ్మెత్తి పోసుకుంటుంటే.. పోలీసులు, ఎమ్మెల్యే షకీల్‌పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే మాత్రం.. పాసుపోర్టుల జారీ విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేస్తూనే.. కేంద్ర విదేశాంగ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో బోదన్ ‌పాసుపోర్టుల వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అంతా అయిపోయింది అనుకుంటే.. అనూహ్య పరిణామాలు..!

72 అక్రమ పాస్‌పోర్టుల జారీలో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్, 11 మందిపై కేసులు, 8 మంది అరెస్టుతో ఈ వ్యవహరం ముగిసినట్టేనని పోలీసులు అనుకున్నారు. కానీ, విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దొంగ పాస్‌పోర్టులతో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా వారిని గుర్తించి వెనక్కి రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు చేపట్టినట్టు తెలుస్తోంది.

పాస్‌పోర్టుల జారీ అంశంను సీరియస్‎గా తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు సంఖ్య మూడంకెలను దాటినట్టు తెలిసింది. కేవలం ఆధార్ కార్డు ఒక్కటే కాకుండా ఓటర్ ఐడీ కార్డులు కూడా వినియోగించినట్టు విచారణలో తేలింది. స్పెషల్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహించే ఏఎస్సై రమేశ్, హెడ్ కానిస్టేబుళ్ల ప్రమేయంతో ఇదంతా జరిగినట్టు అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన పరిమల్ బెన్ అనే యువకుడు ముంబయికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా బోదన్‌‌కు మకాం మార్చి.. ఇక్కడి ఆధార్ సెంటర్ నిర్వాహకుడితో చేతులు కలిపాడు. ఇదే క్రమంలో ఎస్బీలో విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వర్ ఇంట్లోనే ఆయుర్వేద వైద్యుడిగా తిష్ట వేశాడు.

ఇందుకు సహకరించిన మల్లేశ్వర్ రోహింగ్యాలను ఇంట్లో అద్దెకు ఉంచుకోవడమే కాకుండా.. చుట్టు పక్కల అడ్రస్‌లపై కూడా ఆధార్ కార్డులు క్రియేట్ చేసి పాసుపోర్టులు ఇప్పించినట్టు తేలింది. బోదన్‌లోని శర్బత్‌కేనాల్ ప్రాంతంలోనే ఆరు ఇండ్ల పేరు మీద సుమారు 100 మంది రోహింగ్యాలకు పాసుపోర్టులు ఇప్పించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్క బోదన్‌లోనే ఈ స్థాయిలో అక్రమాలు జరిగితే.. మిగతా ఏరియాల్లో పరిస్థితి ఏంటని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.

కూపీ లాగుతున్నారు..

బోదన్‌లో అక్రమ పాసుపోర్టుల భాగోతంతో గతంలో ఏమైనా దొంగపాసుపోర్టులు జారీ చేశారా అన్న కోణంలో అధికారులు కూపీ లాగుతున్నారు. ఇందుకోసం 2014 నుంచి 2020 వరకు జరిగిన పాస్ పోర్టుల జారీపై విచారణ చేపట్టారు. మొత్తం 6 బృందాలుగా ఏర్పడి.. ఒక్కొక్కరు 30 పాస్‌పోర్టులకు చెందిన వారి వివరాలను వెరిఫికేషన్ చేసే పనిలో పడ్డారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు రావడానికి అన్నింటికీ ఒకే అడ్రస్‌ను ఇచ్చినట్టు గుర్తించారు. వారిలో ఆధార్ నెంబర్లు, ఓటర్ ఐడీలు, ఇతర ఒర్జినల్ పత్రాలు ఏ విధంగా వచ్చాయని ఆరా తీస్తున్నారు. అంతేకాదు మొత్తం 300లకు పైగా నకిలీ పాసుపోర్టులు సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు 100 పాస్‌పోర్టుల వరకు గుర్తించినట్టు తెలుస్తోంది.

రాజకీయ దుమారం రేగుతోంది..

బంగ్లాదేశీయులు, మయన్మార్‌కు చెందిన వారు బోదన్‌వాసులుగా పాసుపోర్టులు జారీ కావడంతో రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద దుమారం రేగుతోంది. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక బీజేపీ ఎంపీ అర్వింద్ ఇదే విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నిజామాబాద్ కమిషనర్‌ తీరును విమర్శించారు. ఫిబ్రవరి 25న బాన్సువాడలో జరిగిన బీజేపీ సభలో కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. ఎమ్మెల్సీ షకీల్ ప్రమేయంతో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇచ్చారని ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్సే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుపోర్టుల వైఫల్యానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికితోడు పాసుపోర్టుల విషయంపై బోదన్ ఎమ్మెల్యే షకీల్ బుతుపురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటువంటి పరిణామాలతో రాజకీయ పార్టీల అండతోనే దొంగ పాసుపోర్టులు వచ్చాయా అంటూ స్థానికులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు బోదన్ ఎస్బీ సిబ్బంది ప్రమేయంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరా తీస్తుంటే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం కలవరం పెడుతుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed