వారికి దోచిపెడుతున్న కేసీఆర్.. రైతుబంధు విషయంలో సంచలన విషయాలు

by Anukaran |   ( Updated:2021-12-28 22:47:00.0  )
వారికి దోచిపెడుతున్న కేసీఆర్.. రైతుబంధు విషయంలో సంచలన విషయాలు
X

రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధులో సగానికిపైగా దుర్వినియోగమవుతున్నది. సాగు చేయని భూములకు సైతం సాయం అందుతున్నది. ఇది యాసంగిలో 55.15% ఉండగా.. వానాకాలంలో 14.68% ఉన్నదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వానాకాలంలో85.32% , యాసంగిలో 44.84% భూమి సాగులో ఉంటున్నది. ఇలా వానాకాలంలో రూ. 11,15,53,35,000, యాసంగి సీజన్ లో 41,91,52,60,000 పంట పండించని వారి ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఈ ఏడాది రెండు సీజన్లకు కలిపి ప్రభుత్వం రైతుబంధు రూపంలో రూ. 15,153 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 5,307 కోట్లు సాగు చేయని వారి అకౌంట్లలోకి చేరాయి. వడ్ల పంచాయితీ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో దుర్వినియోగమవుతున్న రైతుబంధు సొమ్మును రానున్న యాసంగి కొనుగోళ్లకు వినియోగించవచ్చనే చర్చ మొదలైంది.

మొత్తం రైతుబంధు అందుతున్న ల్యాండ్.. 1.52 కోట్ల ఎకరాలు
వానాకాలంలో సాగవుతున్న భూమి.. 1,29,68,933 ఎకరాలు
యాసంగిలో సాగవుతున్న భూమి.. 68,16,948 ఎకరాలు (గత యాసంగి)
ఈ యాసంగిలో సాగయ్యే భూమి (అంచనా).. 46,49,676 ఎకరాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధు సాయం పక్కదారి పడుతున్నదా? పన్నుల ద్వారా సమకూరిన సొమ్ము సంక్షేమ పేరుతో దుర్వినియోగమవుతున్నదా? సాగు చేయకుండా పడావుగా పెట్టిన భూములకూ అందుతున్నదా? వానాకాలం సీజన్‌లో కాస్త సక్రమంగా వినియోగమవుతున్నా యాసంగి సీజన్‌లో సాగు అవసరాలకు పనికిరాకుండా పోతున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ ఆచరణలో ఔననే సమాధానమే వినిపిస్తున్నది. పెట్టుబడి సాయం అందుతున్న వారిలో పావు వంతు మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన భూ పట్టాదారులంతా కూర్చుండి రైతుబంధు సొమ్ము అందుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో శాశ్వత బీడు భూములున్నాయి. వాటికి కూడా ప్రతీ విడతలో రైతుబంధు పంపిణీ అవుతున్నది.

సాగులో లేని గుట్టలు, పుట్టలున్న భూములకూ అందుతున్నది. యాసంగిలో సగానికిపైగా భూమి సాగులోకి రాకున్నా ప్రభుత్వం డబ్బు పంపిణీ చేస్తున్నది. వానాకాలంలోనూ 14.68% మేర భూములు సాగులో లేకున్నా పెట్టుబడి సాయం అందుతుండటంతో వేస్ట్ అవుతున్నది. రెండు సీజన్‌లకు సగటున 35% మేర సాగుకు యోగ్యంకాని భూములకూ, సాగుచేయని భూ యజమానులకు అందుతున్నది. ఏటా ప్రభుత్వం రైతుబంధు సాయం పేరుతో రెండు సీజన్‌‌లకు కలిపి రూ. 15,153 కోట్లను విడుదల చేస్తున్నా అందులో దాదాపు రూ. 5,307 కోట్లు వృథా అవుతున్నది.

ఇలా చేస్తే..

రానున్న యాసంగి సీజన్‌కు పారాబాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ కేంద్రం కరాఖండిగా చెప్పేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు, రైతుల నుంచి కొనేది లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వంతంగా డబ్బులు ఖర్చు పెట్టి కొనేంత ఆర్థిత స్థోమత లేదని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రైతుబంధు పథకం కింద వృథాగా పోతున్న 5,307 కోట్ల రూపాయలను యాసంగి సీజన్‌లో రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయడానికి వెచ్చించవచ్చు కాదా..? అనే ప్రశ్నలు ప్రజలు, రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలను ఆదుకోడానికి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి న్యాయం చేయాలన్న సూచనలు వస్తున్నాయి. తాజాగా యాసంగి సీజన్‌ రైతుబంధు సాయం పంపిణీ అవుతున్న సమయంలో ఈ దిశగా చర్చలు జరుగుతుండడం గమనార్హం.

నగరాల శివారులో పడావులకూ..

హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ పట్టణాల శివార్లలో ‘నాలా’ కన్వర్షన్‌ చేయకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న అతి ఖరీదైన భూములకు, స్థిరాస్తి వ్యాపారుల ఆధీనంలోని లే-ఔట్‌లకు, అనధికారికంగా వేసిన వెంచర్లకు సైతం రైతుబంధు నిధులు అందుతున్నాయి. రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు.

నల్లగొండ జిల్లాలో సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, నటులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేయకుండానే రైతుబంధు పొందుతున్నారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం కేశవాపూర్‌, మేడిపల్లి, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల, యాచారం, కొంగరకలాన్‌, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్‌, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలకు వందల ఎకరాల్లో భూములున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల ఓ మంత్రి ఏకంగా 600 ఎకరాలు, మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రికి ఓ గుట్ట ప్రాంతంలో 200 ఎకరాల భూమి ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది.

విఫల ప్రయోగంగా ‘గివ్ ఇట్ అప్’ పిలుపు

మంత్రులతో ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలకు వేలాది ఎకరాల భూములున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గతంలో రైతుబంధు ‘గివ్ ఇట్ అప్’ కింద స్వచ్ఛందంగా వాపసు చేశారు. ఆ మొత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి చేరింది. ఆ తర్వాత అది వెనుకపట్టు పట్టింది. తొలి విడతలో వాపసు చేసిన ఈ పెద్ద రైతులు ముఖం చాటేశారు. ఎన్ని ఎకరాల భూములున్నాయో వివరాలు బహిర్గతమవుతుందనేది వారి భయం. అందుకే రైతుబంధు సాయాన్ని వదులుకోడానికి వెనకాడుతున్నారు.

వద్దంటే వినరేం..

సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబానికి కూడా రైతు బంధు కింద గతంలో చెక్కులు వచ్చాయి. వాటిని తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. రైతుబంధు కింద లాభం పొందుతున్నవారిలో ఎక్కువ మంది సాగుచేసే రైతులే కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే వెల్లడించారు. నిజంగా వ్యవసాయం చేసేవారిని వదిలేసి, భూస్వాములకు ప్రభుత్వం ఈ పథకంతో లాభం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇది వరకు రైతుబంధు కింద తన కుటుంబానికి కూడా రూ.3 లక్షలు వచ్చాయని, తనలా ఆర్థికంగా ఉన్న వారికి ప్రభుత్వ సాయం వద్దన్నారు. తన భార్య పేరిట దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దాన్ని మేం కౌలుకు ఇచ్చామని, తమకు మాత్రం రైతుబంధు రూ. 4 లక్షలు వచ్చాయని, తనకు అందిన డబ్బును పేద రైతులకు పంచానని వెల్లడించారు. తనలాంటి వారికి ప్రభుత్వం సాయం చేయడం అవసరం లేదని చెప్పారు.

19 % భూమి పనికిరానిదే..

ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం 19% భూమి పూర్తిగా వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని మొత్తం సాగుకు యోగ్యమైన భూమితో పోలిస్తే అది దాదాపు 31 లక్షల ఎకరాలు ఉన్నట్లు అంచనా. మొత్తం రైతులను పరిగణనలోకి తీసుకుంటే అందులో 3.3% మంది దగ్గరే ఈ భూమి కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది. దీనికి ఏటా రూ. 3,100 కోట్లు రైతుబంధు సాయం అందుతున్నది.

వానాకాలంలో సాగు చేయకున్నా రైతుబంధు అందుతున్న భూమి 23,22,067 ఎకరాలు
యాసంగిలో సాగు చేయకున్నా రైతుబంధు అందుతున్న భూమి 84,74,052 ఎకరాలు

“ ఈ ఏడాది యాసంగిలో సాగుకాని భూమి (వ్యవసాయ శాఖ అంచనా) 1,06,41,324 ఎకరాలు”

రెండు సీజన్లలో సాగు చేయకున్న రైతుబంధు అందుతున్న భూమి 1,07,96,119 ఎకరాలు
అందుతున్న సొమ్ము (ఎకరాకు పది వేల చొప్పున). రూ. 10,796 కోట్లు

ప్రభుత్వ లెక్కల ప్రకారం సాగుకు పనికి రాని భూమి (గుట్టలు, రాళ్లు) 19 శాతం ( 31 లక్షల ఎకరాలు)
సాగుకు పనికి రాని భూమికి అందుతున్న రైతుబంధు సొమ్ము రూ. 3,100 కోట్లు

ఈ ఏడాది రెండు సీజన్లలో రైతుబంధు కింద జమ చేసిన సొమ్ము రూ. 15,153 కోట్లు
సాగు చేసే రైతులకు అందుతున్న సొమ్ము రూ. 4,357 కోట్లు

ప్రస్తుతం కౌలుదార్లు (సోషల్ ఎకానమీ సర్వే ప్రకారం) 32 శాతం
సాగవుతున్నభూమిలో రైతుబంధు తీసుకోకుండా వ్యవసాయ చేస్తున్న రైతులు 20.8 లక్షల మంది.

కమ్యూనిటీలోకి ఒమిక్రాన్… ప్రజల్లో ఆందోళన

Advertisement

Next Story