- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో విషాదం.. ఎవరీ మెన్నేని సత్యనారాయణ రావు..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, స్వర్గీయ ప్రధాని ఇందిర సన్నిహితుడు ఎమ్మెస్సార్‌గా సుపరిచుతుడు, 87 ఏళ్ల మెన్నేని సత్యనారాయణ రావు జీవితం ముక్కుసూటి తనానికి, నిష్కలంక జీవితానికి తార్కాణం.
బాల్యం-వివాహం:
రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన చీటి హన్మంతరావు, యశోదలకు జన్మించిన సత్యనారాయణ రావు.. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మెన్నేని హనుమంతరావు, మంగమ్మలకు దత్త పుత్రునిగా వెళ్లారు. 1953లో చెన్నమనేని సుగుణను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. ఉస్మానియా యానివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసిన ఆయన జీవితం తెల్ల కాగితం లాంటిదనే చెప్పాలి.
రాజకీయ జీవితం
కరీంనగర్ నుంచి 1971, 1976, 1984 ఎన్నికల్లో మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, కేరళ, కర్నాటక రాష్ట్రాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించారు. ఇందిరా గాంధీ సన్నిహితుడిగా ఉన్న ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1990 నుండి 1994 వరకు, 2007 నుండి 2014 వరకు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో పీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేశారు.
అగ్రవర్ణంలో పుట్టినా..
అగ్రవర్ణ సామాజిక వర్గంలో పుట్టి ఎదిగినా బలహీనవర్గాలు, దళితులపై ప్రత్యేక ప్రేమ చూపే వ్యక్తిత్వం ఆయన సొంతం. జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎమ్మెస్సార్ అంటే నేటి తరానికి అంతగా తెలియదు కావచ్చు. కానీ ఉత్తర ప్రదేశ్, కేరళ, కర్నాటక, జమ్ము కశ్మీర్, పాండిచ్ఛేరి, లక్ష్యదీప్, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృతార్థులయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్మదర్శిగా ఎమ్మెస్సార్ పనిచేసినప్పుడు ఇప్పుడు జాతీయ కాంగ్రెస్‌లో కీలక నాయకునిగా ఉన్న గులాం నబీ ఆజాద్ యూత్ కాంగ్రెస్‌లో తిరిగే వారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను, క్రియాశీలక నాయకులను గుర్తించి వారికి సరైన ప్రాధాన్యం కల్పించారు ఎమ్మెస్సార్.
రావు సాబ్ కా ఇలాఖా హై క్యా..?
ఓ సారి రాజీవ్ గాంధీ ఫ్లైట్‌లో ప్రయాణించేసమయంలో.. అదే ఫ్లైట్‌లో ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందిన మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పరిచయం చేసుకున్నారు. అప్పుడు మోహన్ తాను కరీంనగర్ ఎమ్మెస్సార్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిననని రాజీవ్ గాంధీతో చెప్పారు. దీనికి బదులుగా ‘ఆప్ రావ్ సాబ్ కా ఇలాఖా వాలా హై క్యా’ అని అడిగారంటే ఇందిరా కుటుంబంలో ఎమ్మెస్సార్‌కు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుండూరావ్ వెయిటింగ్..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెస్సార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఢిల్లీకి వస్తున్నానని కర్నాటక ముఖ్యమంత్రి గుండూరావ్ సమాచారం ఇచ్చారు. పది నిమిషాల్లో వస్తానన్న గుండూరావ్ ఇంకా రాలేదని అప్పుడే స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లారు ఎమ్మెస్సార్. ఆయన స్నానం చేసి వచ్చే వరకూ గుండూరావ్ వెయిట్ చేశారు. 45 నిమిషాల తరువాత ఎమ్మెస్సార్ వెయిటింగ్ హాల్‌లోకి వచ్చారు. అంతసేపు వెయింటింగ్ చేసిన గుండూరావ్ ఎమ్మెస్సార్ ఆశీర్వాదం తీసుకుని వెళ్లడం విశేషం.
దుద్దిల్ల శ్రీధర్ బాబుకు జీవం..
1999లో మంథని ఎమ్మెల్యేగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎవరూ ఊహించని విధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని చేశారు ఎమ్మెస్సార్. శ్రీపాదరావు కుటుంబంతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెస్సార్.. ఆయన వారుసుడిగా ఎదిగిన శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించి యువ నాయకత్వానికి ప్రాధాన్యత కల్పించారు.
సమన్యాయం పాటించిన లీడర్..
ఎమ్మెస్సార్ తన కెరీర్‌లో ఎదుటువారు చదువుకున్నాడా, చురుగ్గా ఉన్నాడా అన్న రెండు విషయాలనే పరిగణనలోకి తీసుకునేవారు. ఈ లక్ష్యంతోనే ఆయన బీసీలు, ఎస్సీలను ఎంకరేజ్ చేశారు. ఆయన శిష్యరికంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ మొట్టమెదటి మేయర్ డి.శంకర్, నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే జానకీ రాంలతో పాటు చొప్పదండి నియోజకవర్గం నుండి రామస్వామి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చి తన సచ్ఛీలతను చాటుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్చేగా గెలిచిన కోడూరి నత్యనారాయణ గౌడ్ కూడా ఎమ్మెస్సార్ శిష్యుడే.
కేసీఆర్ కే సవాల్..
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్సార్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఎమ్మెస్సార్ ప్రకటనలతో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశారు. 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ గెలిచిన తరువాత తన మాటకు కట్టుబడి ఎమ్మెస్సార్ దేవాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. అప్పుడు సీఎం వైఎస్ సత్తన్న మీరిలా ఉండడం సరికాదని ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి కేబినెట్ హోదా ఇచ్చారు.
వారసులు మాత్రం దూరం..
కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగిన ఎమ్మెస్సార్ తన వారసులను మాత్రం రాజకీయాలకు దూరంగానే పెంచారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఏనాడు కూడా వారు ప్రత్యక్ష్య రాజకీయాల్లో కనిపించలేదు. వారసులను రాజకీయాల్లోకి దింపేందుకు ఉవ్విళ్లూరుతున్న కొంతమంది నాయకులకు విలక్షణమైన ఎమ్మెస్సార్ ఆదర్శమనే చెప్పాలి.