15 రోజుల్లో వలస కూలీలను తరలించండి: రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

by Shamantha N |
15 రోజుల్లో వలస కూలీలను తరలించండి: రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు
X

న్యూఢిల్లీ: వలస కూలీలందరినీ 15 రోజుల్లోగా తమ స్వగ్రామాలకు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికి దూరంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస శ్రామికులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు 15 రోజులు సరిపోతాయనే భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల ఈతిబాధలను విచారిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్‌కే కౌల్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించనుంది. 15 రోజుల్లో వలస కూలీలందరినీ వారి సొంతూళ్లకు తరలించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు వారందరికీ కల్పించే ఉపాధి, సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాలని తెలిపింది. వలస శ్రామికుల వివరాలను తప్పకుండా నమోదు చేయాలని సూచించింది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికి సుమారు ఒక కోటి మంది వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించామని కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా తెలిపారు. 41 లక్షల మందిని బస్సులు, ఇతర వాహనాల ద్వారా, 57 లక్షల మందిని ట్రైన్‌ల ద్వారా చేరవేశామని వివరించారు. కాగా, ఢిల్లీలో రెండు లక్షల మంది వలస కూలీలు ఇంకా ఉన్నారని, వారు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ తరఫున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ తెలిపారు. ఇందులో కేవలం 10వేల మంది మాత్రమే తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లాలని భావిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రాలకు రెండు బాధ్యతలున్నాయని, వేరే రాష్ట్రాల్లోని తమ రాష్ట్రవాసులను క్షేమంగా తీసుకువచ్చుకోవడమే కాదు, వేరే రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తరలించాల్సిన అవసరమున్నదని యూపీ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహా అన్నారు. 5.50 లక్షల కూలీలను ఢిల్లీ సరిహద్దుల నుంచి యూపీకి తీసుకువచ్చామని, 21.69 లక్షల మందిని ట్రైన్‌ల ద్వారా తీసుకురాగలిగామని చెప్పారు. అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన 1.35 లక్షల మంది వలసకూలీలను తరలించేందుకు 104 స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు వెల్లడించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిషా, కేరళ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు వలస కూలీల తరలింపునకు సంబంధించిన వివరాలను కోర్టుకు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed