ఎస్పీడీసీఎల్ లోనూ సెల్ఫ్ బిల్లింగ్

by Shyam |
ఎస్పీడీసీఎల్ లోనూ సెల్ఫ్ బిల్లింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ శాఖ కొవిడ్ వల్ల సతమతమవుతోంది. కరోనా సోకుతుందనే భయంతో మీటర్ రీడింగ్ తీసేందుకు స్పాట్ బిల్లర్లు ఆసక్తి చూపించడంలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల క్షేమం కోసం ఎన్పీడీసీఎల్ ఇప్పటికే స్పాట్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే దారిలో ఎస్పీడీసీఎల్ కూడా అగుగులేస్తోంది. ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ అనే యాప్ ను విద్యుత్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా ఫోన్ లోనే ఎంత విద్యుత్ ను వినియోగించాం. ఎంత బిల్లు వచ్చిందో తెలుసుకోవచ్చు.

చెల్లింపులు కూడా ఈ యాప్ ద్వారానే చేసుకునే అవకాశాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కల్పించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలో ఎస్పీడీసీఎల్ సంస్థ వెల్లడించనుంది. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ‘టీఎస్ ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్’ అనే యాప్ ను వినియోగదారులకు తాత్కాలికంగానే అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే టీఎస్ ఎస్పీడీసీఎల్ కు చెందిన భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ను పూర్తిస్థాయిగా అందుబాటులోకి తీసుకువచ్చి రీడింగ్ బిల్లు తెలుసుకోవడమే కాకుండా చెల్లింపులు కూడా జరిగేలా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

రీడింగ్ తెలుసుకోవడం ఇలా..

వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ ఎస్పీడీసీఎల్’ యాప్ లేదా ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ను ఓపెన్ చేసి కన్స్యూమర్ సెల్ఫ్ బిల్లింగ్ ఆప్షన్ ను క్లిక్ చేసి యూనిక్ సర్వీస్ నంబర్ ను ఎంటర్ చేయాలి. వినియోగదారుల వివరాలు ఎంటర్ చేసి స్కాన్ మీటర్ అనే ఆప్షన్ బటన్ ను నొక్కాలి. ఒకవేళ స్కాన్ అవ్వకుంటే స్కాన్ అండ్ కాప్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రీడింగ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం జనరేట్ ఇన్ స్టంట్ బిల్ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్నాక వచ్చిన బిల్లును ఆన్ లైన్ లోనే చెల్లించేలా యాప్ ను రూపొందించారు.

Advertisement

Next Story