మంత్రాలయంలో భక్తుడిని చావబాదిన సెక్యూరిటీ సిబ్బంది

by Anukaran |   ( Updated:2023-03-24 18:04:09.0  )
మంత్రాలయంలో భక్తుడిని చావబాదిన సెక్యూరిటీ సిబ్బంది
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయంలో సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. విచక్షణ మరచి ఓ భక్తుడిపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకంపై ప్రశ్నించాడని తెలుస్తోంది. దీంతో వారు సహనం కోల్పోయి అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. కొట్టద్దు.. కొట్టద్దు అని ప్రాధేయపడినా సెక్యూరిటీ సిబ్బంది భక్తుడ్ని వదలలేదు. కర్రలు, పైపు, ప్లాస్టిక్ లాఠీతో భక్తునిపై ఐదు, ఆరు మంది సెక్యూరిటీ సిబ్బంది అతడిపై దాడికి పాల్పడ్డారు. దెబ్బలు తాళలేక విలపిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమా అని అడిగినందుకు తనపై దాడి చేశారని ఆ భక్తుడు ఆరోపిస్తున్నాడు. దేవుడి దర్శనానికి వచ్చిన భక్తుడిని కొట్టడంపై తోటి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని భక్తులు డిమాండ్ చేశారు.

అతను ఓ మానసిక రోగి…

ఈ ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది మరో వాదన వినిపిస్తున్నారు. అతడు ఒక మానసిక రోగి అని ఆరోపిస్తున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన అతను నిక్కరుతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నామని దీంతో అతడు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్తున్నారు.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా తాము కూడా దాడి చేశామంటున్నారు. మంత్రాలయానికి వచ్చిన ఆ భక్తులు అందరికీ చాక్లెట్లు పంచడం, స్నానం కోసం అధిక షాంపూలు కొనడం, బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెప్తూ నానా హంగామా చేశాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా సెక్యూరిటీ సిబ్బంది భక్తుడిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed