స్మార్ట్ మీటర్‌తో ప్రీ-పెయిడ్ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం

by Shyam |   ( Updated:2021-08-01 12:03:30.0  )
Smart meter
X

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల (ప్రీ-పెయిడ్) విధానం తప్పనిసరి కానున్నది. పోస్ట్ పెయిడ్ విధానానికి కాలం చెల్లిపోనున్నది. బిల్లింగ్ విధానమూ ఉండదు. ఎప్పుడు రీచార్జి అయిపోతే ఆ క్షణంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్ళీ రీచార్జి చేయగానే సప్లయ్ కంటిన్యూ అవుతుంది. విద్యుత్ సంస్థలను నష్టాల నుంచి బయటపడేసి లాభాలను ఆర్జించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దశలవారీగా దేశమంతా అమలులోకి రానున్నది. ఈ విధానాన్ని అన్ని డిస్కంలు అమలు చేయాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈ ఏడాది డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకోవాలని డిస్కంలకు గడువు విధించింది.

విద్యుత్ సరఫరాలో లీకేజీలను, వృథాను అరికట్టడానికి, బిల్లుల బకాయిలను నివారించుకోడానికి, పారదర్శకత తీసుకురావడానికి స్మార్ట్ మీటరింగ్ విధానంపై దృష్టి పెట్టింది. విద్యుత్ రంగంలో గత కొన్నేళ్ళుగా అమలవుతున్న సంస్కరణల్లో తాజాగా ఇది చేరింది. స్మార్ట్ మీటరింగ్ విధానం గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో స్మార్ట్ మీటర్ విధానాన్ని వినియోగంలోకి తేవడానికి 2023 డిసెంబరును డెడ్‌లైన్‌గా పెట్టుకున్నది.

విద్యుత్ వినియోగదారులంతా స్మార్ట్ మీటర్లను పెట్టుకోవాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రతి మీటర్‌కు రూ.900 చొప్పున స్వచ్ఛందంగా రాయితీ రూపంలో సమకూర్చనున్నది. నిర్దిష్ట గడువులోగా మీటర్‌ను బిగించుకునేలా వినియోగదారులకు అవగాహన కల్పించి చొరవ తీసుకున్న డిస్కంలకు అదనంగా ప్రతీ మీటర్‌కు రూ.450 చొప్పున ఇన్సెంటివ్‌గా లభించనున్నది. విద్యుత్ సంస్థల లాభాలు, నష్టాల నివారణ తదితరాల సంగతి ఎలా ఉన్నా స్మార్ట్ మీటర్ల రూపంలో సామాన్యుడిపై భారం పడనున్నది.

ఇప్పటివరకూ వినియోగదారులు ప్రతీ నెలా డిస్కంల నుంచి బిల్లులు అందుకుని వాటి ప్రకారం చెల్లింపులు చేస్తున్నారు. ఇకపైన అన్నీ ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లే కావడంతో బిల్లింగ్ చేసే సిబ్బంది ఉండరు. బిల్లులూ రావు. మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రీచార్జి చేసుకోకుంటే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ సంస్కరణల ద్వారా ఇంతకాలం మీటర్ రీడింగ్ తీసుకున్న సిబ్బంది ఇప్పుడు వీధిన పడతారు. లేదా డిస్కంలు వారి ఉద్యోగాలకు భరోసా కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే ఇతర అవసరాలకు వినియోగించుకుంటాయి.

తొలి దశలో పాతిక కోట్ల మీటర్లు

దేశం మొత్తం మీద ఫస్ట్ ఫేజ్‌లో 25 కోట్ల స్మార్ట్ మీటర్లను ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ భావిస్తున్నది. ఇందుకోసం అన్ని దశల్లో కలిపి మొత్తం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసుకున్నది. ఒక్కో స్మార్ట్ మీటర్ ధర దాదాపు ఐదున్నర వేల రూపాయల పైనే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందులో 15 శాతం (రూ. 900) రాయితీ ఇవ్వనుంది. మిగిలిన భారాన్ని వినియోగదారులు భరించాల్సిందే. పూర్తి భారం ఒకేసారి పడకుండా వాయిదాలా పద్ధతిలో అవకాశం కల్పించనున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ప్రీ-పెయిడ్ మీటర్ల వినియోగం డిస్కంలకు లాభమేనని వారి అభిప్రాయం. విద్యుత్ లీకేజీలు తగ్గడంతో పాటు చౌర్యం పూర్తిగా ఆగిపోతుందని పేర్కొన్నారు. ముందుగానే డబ్బులను రీచార్జి రూపంలో చెల్లించి విద్యుత్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి డిస్కంలకు ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలవుతాయని నొక్కిచెప్పారు. నష్టాల బారి నుంచి గట్టెక్కొచ్చని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ నష్టం 21 శాతంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలలోనూ దాదాపు ఇదే స్థాయిలో ఉంది. దీన్ని తగ్గించడానికే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తున్నది. డిస్కంల ఆర్థిక నష్టాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ‘ఉదయ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2019 వరకు నష్టాలను 15 శాతానికి తగ్గించి డిస్కంలకు గట్టెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ 2019-20లో అన్ని రాష్ట్రాల డిస్కంలు రూ. 61,360 కోట్ల నష్టాల్లో ఉంటే 2020-21 నాటికి అది రూ.38 వేల కోట్లకు తగ్గింది. ఆశించినట్లుగా ‘ఉదయ్‘ పథకం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది.

అయితే స్మార్ట్ మీటరింగ్ విధానం పటిష్టంగా అమలుకావాలంటే వినియోగదారులు మీటర్లను బిగించుకుంటేనే సరిపోదు. దానికి తగిన మౌలిక సదుపాయాలను డిస్కంలు కల్పించుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల పనితీరుకు అనుగుణంగా ఫీడర్ల విభజన కూడా జరగాలి. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల అమలవుతూ ఉన్నది. ఆ పనితీరు సంతృప్తికరంగా ఉందనే అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీ-పెయిడ్ విధానంతో రాజకీయ జోక్యం, సమాజంలో పలుకుబడి లాంటివాటికి తావు ఉండదని, బిల్లులు చెల్లింపునకు నోచుకోకుండా మొండి బకాయిలుగా ఉండే అవకాశమే లేదని డిస్కం ఇంజనీర్ ఒకరు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు సబ్సిడీ చెల్లింపులు టైమ్‌కు జరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

విధానం మంచిదే.. కానీ అదనపు భారం

Koteshwar rao

“ప్రీ-పెయిడ్ మీటర్ల విధానంతో డిస్కంలు లాభాల బాట పడుతాయన్నది నిజమే. కానీ వినియోగదారులపై భారం పడుతుంది. బిల్లింగ్ లేకపోవడంతో ఉద్యోగులకు నష్టం. రైతులపై భారం పడుతుంది. వారికి అందుతున్న సబ్సిడీలకు కోతపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలను యథావిధిగా కొనసాగించినా సకాలంలో నిధులు విడుదల కాకపోతే రైతులే చేతుల్లోంచి కట్టాల్సి వస్తుంది. రీచార్జిలో ఆలస్యమై కరెంటు సరఫరా నిలిచిపోతే వ్యవసాయ పనులకు ఆటంకమవుతుంది. డిస్కంలలో సంస్కరణల అమలుతో క్రమంగా ప్రైవేటీకరణ చొరబడుతుంది. యూనిట్ ఛార్జీలూ పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు బాగుపడతాయి’’.
-కోటేశ్వరరావు, ఏడీఈ, విద్యుత్ శాఖ

మీటర్ రీడర్లకు బతుకుండదు

“ప్రీ-పెయిడ్ మీటర్లు తప్పనిసరి అయితే మీటర్ రీడింగ్ తీసుకునే సిబ్బంది అవసరం ఉండదు. వారి ఉద్యోగాలు పోతాయి. వీధిన పడతారు. వారిని తొలగించేందుకే కేంద్రం ఈ విధానాన్ని అమలుచేస్తున్నది. సామాన్యులు కూడా మీటర్లు మార్చుకోడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాన్ని అరికట్టాలి’’
– నాగరాజ్, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ వీడబ్ల్యూ 2871 వ్యవస్థాపక అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed