సచివాలయం కూల్చివేత… అంతా గోప్యం

by Shyam |   ( Updated:2020-07-09 10:03:44.0  )
సచివాలయం కూల్చివేత… అంతా గోప్యం
X

దిశ, న్యూస్‌బ్యూరో: పాత సచివాలయం కూల్చివేత పనుల్లో ప్రారంభం నుంచీ అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మీడియాకు సైతం వివరాలు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధాన కార్యదర్శి, డీజీపీల పర్యవేక్షణలో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. జేసీబీ యంత్రాలు కూలుస్తున్న ఫోటోలు మీడియాకు చిక్కడంపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. సచివాలయం చుట్టూ ఉన్న ఎనిమిది రోడ్లను అష్టదిగ్బంధనం చేసినా ఫోటోలు ఎలా బైటకు పొక్కాయో ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్నవారి ద్వారానే బైటకు వెళ్ళి ఉంటాయని అనుమానించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు మొత్తం ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలతో నిఘా వేశారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసుల ద్వారా ఈ ఫోటోలు బైటకు వెళ్ళినట్లు దాదాపుగా ఖరారు చేసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్ళను అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.

సచివాలయానికి సుమారు ఒక కిలోమీటర్ దూరం నుంచే ఆంక్షలు విధించినా లోపలి విషయాలు బైటకు వెళ్తుండడం, ఫోటోలు మీడియాకు చేరుతుండడం అధికారులను ఆగ్రహానికి గురిచేసింది. మూడు రోజులుగా జరుగుతున్న కూల్చివేత పనుల్లో సి, డి, జి బ్లాకులతో పాటు తెలంగాణ ఎంట్రీ గేటు పక్కన ఉన్న విద్యుత్ శాఖకు చెందిన రాతి భవనం కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయని, గురువారం సాయంత్రానికి ఏ, బి బ్లాకుల కూల్చివేత జరుగుతూ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఎనిమిది రోడ్లపై విధించిన ఆంక్షలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం భవనాల కూల్చివేత పూర్తయ్యేంత వరకు ఈ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. జేసీబీలను నడిపే డ్రైవర్లతో పాటు కూల్చివేత పనుల్లో ఉన్నవారందరి మొబైల్ ఫోన్లను సెక్యూరిటీ పాయింట్ దగ్గరి వరకే పోలీసులు అనుమతిస్తున్నారు. ఫోటోలు తీయడానికి అవకాశం లేకుండా చేయడంతో పాటు వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వారి కదలికలపై సీసీటీవీ నిఘా కొనసాగుతోంది.

ఆద్యంతం రహస్యంగా సాగుతున్న ఈ పనులపై చిన్న సమాచారం కూడా బైటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు, అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్వాధీనమైన జే, కే, ఎల్, బ్లాకులతో పాటు హెచ్ నార్త్, హెచ్ సౌత్ బ్లాకుల కూల్చివేతపై సమాచారం బైటకు రావడంలేదు. కూల్చివేత సమాచారాన్ని మీడియాకు అందిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు కానిస్టేబుళ్ళ ఫోన్లను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడి డ్యూటీ నుంచి మరోచోటికి మార్చారు. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా పోలీసులు, కార్మికులు జంకుతున్నారు.

Advertisement

Next Story