పోలింగ్ శాతం వెల్లడించడంలో జాప్యమెందుకో?

by Shyam |
పోలింగ్ శాతం వెల్లడించడంలో జాప్యమెందుకో?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 6 గంటల కల్లా ముగిసినా తుది గణాంకాలను వెల్లడించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ వివరాలను ప్రతీ రెండు గంటలకోసారి బులెటిన్ రూపంలో వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం పోలింగ్ వివరాలను డివిజన్ల వారీగా వెల్లడించడానికి మాత్రం రకరకాల సాంకేతిక కారణాలను తెరమీదకు తీసుకొస్తుంది. సాయంత్రం ఐదుగంటల వరకూ జరిగిన పోలింగ్ వివరాలను ఏడు గంటలకల్లా వెల్లడించి సగటున 36.01% మేర జరిగినట్లు తెలియజేశాయి. కానీ ఐదు గంటల తర్వాత క్యూలో నిల్చుని ఉన్నవారు, కరోనా పాజిటివ్ పేషెంట్లకు మాత్రమే అవకాశం ఇచ్చినందున చివరి ఫలితాలను మాత్రం అర్ధరాత్రి వరకూ వెల్లడించలేదు. దీంతో పోలింగ్ శాతం వెల్లడించడంలో జాప్యమెందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బుధవారం ఉదయం పూర్తి వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతీ రెండు గంటలకు ఒకసారి బులెటిన్‌ను విడుదల చేసిన అధికారులు చివరి గణాంకాలను వెల్లడించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 9.00 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను కేవలం అరగంటలోపే (9.30 గంటలకల్లా) విడుదల చేశారు. ఆ తర్వాత 11.00 గంటల వరకు పోల్ అయిన వివరాలను మరో అరగంట తర్వాత.. అలా సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను రాత్రి ఏడు గంటలకల్లా విడుదల చేశారు. కానీ చివరి గంటలో జరిగిన పోలింగ్ వివరాలను మాత్రం నిర్దిష్ట పోలింగ్ కేంద్రాల నుంచి పూర్తి వివరాలు ఇంకా అందలేదని, క్రోడీకరించే ప్రక్రియ జరుగుతూ ఉందని.. ఇలాంటి సాంకేతిక కారణాలను తెరపైకి తెచ్చి పోలింగ్ శాతాన్ని పెంచి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story