- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడికెళ్లి టీచర్లు ఏం చేయాలి?
దిశ ఏపీ బ్యూరో: రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. విద్యార్థులు రారు, పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్కూళ్లు మాత్రం తెరుచుకోనున్నాయి. ఒక రకంగా విద్యా సంవత్సరం రేపటి నుంచే ఆరంభమవుతుందని అనొచ్చు. కారణం రేపటి నుంచి టీచర్లు విధిగా పాఠశాలలకు వెళ్లాలి. విద్యార్థులు రాకున్నా, పాఠాలు చెప్పాల్సిన అవసరం లేకున్నా టీచర్లు మాత్రం స్కూళ్లకు వెళ్లాలి. కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నా, రెడ్ జోన్‌లో ఉన్నా, గ్రీన్ జోన్‌లో ఉన్నా స్కూళ్లకు మాత్రం అంటెండ్ కావాల్సిందే.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత మార్చి 22 నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విద్యాసంవత్సరం అసంపూర్తిగానే ముగిసింది. పాఠశాలల పిల్లలంతా పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి స్కూళ్లకు హాజరుకావాలంటూ టీచర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారంలో రెండు రోజుల పాటు స్కూళ్లకు హాజరు కావాలని నిబంధన పెట్టింది. దీంతో టీచర్లు స్కూళ్ల బాటపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక్కడే టీచర్ల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్కూళ్లకు వెళ్లి ఏం చేయాలి? విద్యార్థులుండరు. స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు నాడు-నేడు నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. స్కూళ్లు ఆరంభమయ్యేనాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. డీఈవో, ఎంఈవోలు ఆ పనుల పర్యవేక్షణతో పాటు పనులకు సంబంధించిన నిధుల విడుదల, బిల్లులు సరిచూడడం వంటి పనులతో బిజీగా ఉంటారు. మరి టీచర్లు ఏం చేయాలి? పరీక్షలు జరగని నేపథ్యంలో విద్యార్థుల పాస్ గ్రేడింగ్ లేదా మార్కులు వేయాలంటే దానికి కేవలం ఒక్క రోజు సరిపోతుందని టీచర్లు రికార్డులు గుద్దిమరీ చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.81 లక్షల మంది ఉపాథ్యాయులు స్కూళ్లలో సేవలందిస్తున్నారు. ఇందులో ప్రైమరీ స్కూళ్లలో 71,634 మంది టీచర్లు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మరో 25,574 మంది అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ, ఇంకో 84,146 మంది టీచర్లు హైస్కూళ్లలోనూ పని చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల బేధాలు తీసేస్తే ఏపీలోని 13 జిల్లాల్లో ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలతో కలిపితే 5 లక్షల, 76 వేల, 960 మంది టీచర్లు ఏటా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారన్నది ఒక అంచనా. ఇందులో 1.81 లక్షల మంది రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. వారంలో రెండు రోజులు పాఠశాలలకు హాజరుకావాల్సిందే.
దీనిపై టీచర్ల యూనియన్లు పెదవి విరుస్తున్నాయి. వారంలో రెండు రోజులు పాఠశాలలకు ఊరికే వెళ్లి తిరిగి వచ్చే కంటే.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఉపయోగపడేలా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినా ఉపయోగకరంగా ఉండేదని అభిప్రాయపడుతున్నాయి. తద్వారా ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్లు నైపుణ్యం మెరుగుపరుచుకునే వారని పేర్కొంటున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని పెదవి విరుస్తున్నారు. మరోవైపు టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్‌లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాసంవత్సరం ఆరంభమయ్యేందుకు ఆలస్యమవుతున్న తరుణంలో ఆ తతంగం పూర్తి చేసినా విద్యాసంవత్సరం ఆరంభమయ్యేనాటికి టీచర్లు కుదురుకునేవారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇవేవీ చెయ్యకుండా స్కూళ్లను ఓపెన్ చెయ్యడం ద్వారా ప్రభుత్వం టీచర్ల నుంచి ఏం ఆశిస్తుందన్నది తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు విద్యాశాఖ కమిషనర్ టీచర్లను చిన్న చూపుచూస్తున్నారన్నది టీచర్ల నుంచి వినిపించే ఫిర్యాదు. గతంలో లాక్‌డౌన్ సమయంలో టీచర్లను లిక్కర్ షాపుల ముందు విధులకు నియమించడం టీచర్లను అవమానించడం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. బలమైన యూనియన్లు ఉన్నప్పటికీ టీచర్లకు ఇష్టారీతిన ఆదేశాలు జారీ చేయడం సరికాదని పలువురు యూనియన్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.