హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ షాకిస్తుందా..?

by Anukaran |   ( Updated:2021-08-17 06:40:17.0  )
huzurabad-revanth
X

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : హుజురాబాద్ ఉప ఎన్నిక టికెట్‌ను మాదిగ‌ల‌కే కేటాయించాల‌ని డిమాండ్ చేస్తూ పార్టీలోని కొంత‌మంది సామాజిక వ‌ర్గం నేత‌లు ప‌ట్టుబ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్సన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేత‌లు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశమ‌య్యారు. హుజురాబాద్ టికెట్‌ను మాదిగ‌ల‌కే కేటాయించాల‌ని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపై సంత‌కాలు చేశారు. సంత‌కాల ప్రతిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియ‌గాంధీకి కూడా ఫ్యాక్స్ చేశారు.

అంతేకాకుండా, పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జీ మాణికం ఠాగూర్‌, పీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డితోనూ నేత‌లు ఫోన్‌లో మాట్లాడిన‌ట్లుగా విశ్వస‌నీయంగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ద‌ళిత‌బంధు స్కీమ్‌‌ను అమలు చేసి ద‌ళితుల ఓట్లతో అక్కడ స్థానం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంద‌ని, ఈ నేప‌థ్యంలో మాదిగ‌ల‌కు పార్టీ టికెట్ కేటాయించ‌డం ద్వారా పార్టీపై ప్రజ‌ల్లో విశ్వాసం పెంపొందుతుంద‌ని విన్నవించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా గాంధీ భ‌వ‌న్‌లో మాదిగ నేత‌లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మై, తీర్మానించుకున్న కాపీలు మీడియాకు లీక‌వ‌డం గ‌మ‌నార్హం. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆల‌స్యం చేసింద‌న్న విమ‌ర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్తగా మాదిగ నేత‌ల డిమాండ్‌ను అధిష్ఠానం ప‌రిశీలిస్తుందా..? ప‌రిశీలించి టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకుంటుందా..? అన్నది వేచి చూడాలి

సెన్సేషనల్ న్యూస్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ ఫిక్స్.!

Advertisement

Next Story